జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక ప్యాకేజీ ఇస్తున్నట్టు వెల్లడించారు. భూమి, కార్మిక చట్టాలు, ద్రవ్య లభ్యత, చట్టాలు... ఇలా ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్యాకేజీని రూపొందించినట్లు వివరించారు మోదీ. పేదలు మొదలు పరిశ్రమల వరకు.. ప్రతి వర్గానికి అండగా నిలిచేలా ఈ ప్యాకేజీ ఉంటుందని తెలిపారు.. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సాహసోపేత సంస్కరణలతో ముందుకు సాగడం అనివార్యమన్నారు మోదీ. గత ఆరేళ్లలో చేపట్టిన సంస్కరణల కారణంగానే ఈ సంక్లిష్ట సమయంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ సుదృఢంగా ఉందని చెప్పారు. కరోనా సంక్షోభంతో నిలిచిన ప్రగతి రథాన్ని తిరిగి గాడిన పెట్టే లక్ష్యంతో చారిత్రక అడుగు వేసింది మోదీ సర్కార్. ఆత్మ నిర్భర భారత్​ అభియాన్​ పేరిట ఏకంగా రూ.20 లక్షల కోట్ల రూపాయల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది.

ప్రధాని మాట్లాడుతూ "కరోనాపై యుద్ధం చేస్తూనే అభివృద్ధి దిశగా ముందుకు సాగుదాం. ఈ బాధ్యతను 130 కోట్ల మంది భారతీయులం తలకెత్తుకుందాం. లాక్‌డౌన్‌-4లో కూడా అన్ని జాగ్రత్తలు, నియమాలు పాటిద్దాం. కరోనాతో పోరాడుతూనే ముందడుగు వేయాలి. 21వ శతాబ్దం మనదే.. ఆత్మ నిర్భర భారతదేశమే మన లక్ష్యం. 21వ శతాబ్దం భారత్‌దేనని గత శతాబ్దం నుంచి ఎప్పుడూ వింటూ వచ్చాం. ఈ కష్టకాలంలో చిన్న వ్యాపారులు, ఇళ్లల్లో పనిచేసేవారు, శ్రామికులు ఇబ్బందులు పడ్డారు. సంఘటిత, అసంఘటిత రంగంలోని ప్రతి వ్యక్తిని ఆర్థిక ప్యాకేజీ కాపాడుతుంది. స్థానిక మార్కెట్లను విస్తరించాల్సిన అవసరాన్ని ఈ సంకట స్థితి తెచ్చింది. గ్లోబల్‌ డిమాండ్‌తో పాటు, స్థానిక డిమాండ్‌ను సృష్టించాలి. మనం స్థానికంగా తయారు చేసిన వస్తువులకు గ్లోబల్‌ డిమాండ్‌ సృష్టించాలి."

"మన వస్తువులను మనమే కొనుగోలు చేస్తే కొత్త ఉపాధి లభిస్తుంది. ఖాదీ కొనండి, స్థానిక చేనేత కారులకు ఉపాధి లభిస్తుంది. మాస్కులు కట్టుకుందాం, ఆరడుగుల దూరం పాటిద్దాం. పనిని ఆపకుండానే కరోనాను ఎదుర్కోందాం. నాలుగో దశ లాక్‌డౌన్‌కు కొత్త మార్గదర్శకాలు మే 18 లోపు ఇస్తాం. కరోనాపై యుద్ధం చేస్తూనే అభివృద్ధి దిశగా ముందుకు సాగుదాం. ఈ బాధ్యతను 130 కోట్ల మంది భారతీయులం తలకెత్తుకుందాం. నవీన సంకల్పం, కొత్త ప్రాణశక్తితో అడుగు ముందుకు వేద్దాం. కొత్త నైపుణ్యాలు, కొత్త ఆలోచనలతో భారత్‌ను ముందుకు తీసుకెళ్దాం. కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలకు అనేక అవకాశాలు ఉన్నాయి. దేశంలో ప్రతి పారిశ్రామికుడిని కలుకుపుకొని పోయేలా ప్యాకేజీ." అని ప్రధాని మోడీ అన్నారు.

Advertisements