విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంపై రాష్ట్ర హైకోర్టు స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న ఉన్నత న్యాయస్థానం.. దీనిపై కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. జనావాసాల మధ్య అలాంటి పరిశ్రమ ఎందుకు ఉందని ప్రశ్నించింది. విచారణను వారంపాటు వాయిదా వేసింది. అలాగే, విశాఖలో గ్యాస్ లీక్ ఘటనపై ఏపీ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఘటనను సుమోటోగా స్వీకరించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం... మానవ తప్పిదం కారణంగానో, నిర్లక్ష్యం వల్లనో ఘటన జరిగినట్లు రుజువు కాకపోయినా... అమాయక ప్రజల ప్రాణాలు పోయాయని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది.

ఒకవైపు కరోనా ప్రభావంతో దేశంలో ప్రజల ప్రాణాలు ప్రమాదకరంగా మారుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు దురదృష్టకరం అని మానవహక్కుల సంఘం అభిప్రాయపడింది. పూర్తి సమాచారంతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టి నివేదిక అందజేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై స్పందించి.. నియమ నిబంధనలు ఉల్లంఘన, సంబంధిత వ్యవహారాలపై నివేదిక ఇవ్వాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శికి కూడా ప్రత్యేకంగా నోటీసులు జారీ చేసిన ఎన్​హెచ్ఆర్సీ.

విశాఖ గ్యాస్​ ఘటనలో ప్రభావితులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఎయిమ్స్​ డైరెక్టర్​ రణదీప్​ గులేరియా సూచించారు. గ్యాస్ పీల్చిన వారికి కళ్లు, గొంతునొప్పి, వాంతులు అయ్యాయని అన్నారు. ప్రమాదకర రసాయనం వల్ల ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుందని వెల్లడించారు. విష వాయువు ఎక్కువ మోతాదులో పీలిస్తే శ్వాస తీసుకోవడం ఆగిపోయి ఊపిరితిత్తుల్లో ఇబ్బందులు ఏర్పడతాయని వివరించారు. తీవ్రమైన హృద్రోగ సమస్యలు వస్తాయన్నారు. బాధితులు వెంటనే ఆక్సిజన్​ థెరపీ తీసుకోవాలని.. మంచినీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలని ఎయిమ్స్​ డైరెక్టర్​ పేర్కొన్నారు. పరిశ్రమలన్నీ లాక్​డౌన్​ నిబంధనలు పాటించాలన్న ఆయన.. కార్మికులు భౌతిక దూరం పాటించాలన్నారు.

Advertisements