వైసీపీప్రభుత్వం అమరావతికి వ్యతిరేకంగా మరోకుట్ర పన్నిందని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటినుంచీ రాజధానికి వ్యతిరేకంగా ఎన్నోరకాల కుట్రలు పన్నారని, ఇంకెన్నో రకాల అభాండాలు వేశారని, మరెన్నో రకాలుగా దుష్ప్రచారాలు చేశారని టీడీపీ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రకాశం బ్యారేజీ నుంచి వరదను సకాలంలో కిందకు వదలకుండా కావాలనే నీటిని అమరావతి మునిగేలా నిల్వచేశారు. అయినాకూడా జగన్ ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రకాశం బ్యారేజీ నుంచి సకాలంలో నీటిని దిగువకు వదలకుండా, బ్యారేజీ గేట్లు పూర్తిగా తెరవకుండా కుట్రలు చేసిందన్నారు. రాష్ట్రప్రభుత్వానికి చెందిన వాటర్ రిసోర్స్ డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ ను పరిశీలిస్తే, రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలోని నీటినిల్వలు, పైనుంచి వస్తున్న ప్రవాహం, దిగువకు వదులుతున్న నీటి ప్రవాహం వివరాలు ఉంటాయన్నారు. ఆ వెబ్ సైట్ ను పరిశీలిస్తే, 13-10-2020న సాయంత్రం 4గంటలకు, ప్రకాశం బ్యారేజీకి చేరుతున్న వరద 2లక్షల79వేల490 క్యూసెక్కులైతే, దిగువకు వదిలే నీరు, లక్షా 98వేల450 క్యూసెక్కులుగా ఉందని పట్టాభి పేర్కొన్నారు. అదేవిధంగా 14-10-2020న ఉదయం 8 గంటలకు ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరద ప్రవాహం 13వ తేదీ మాదిరే 2లక్షల79వేల 490క్యూసెక్కులుగానే ఉందని, బ్యారేజీనుంచి దిగువకు వదిలే నీటిపరిమాణం మాత్రం అమాంతం 5లక్షల64వేల06క్యూసెక్కులకు పెరిగిందన్నారు.

13వతేదీ సాయంత్రం లక్షా98వేల450క్యూసెక్కులుగా ఉన్న వరద, కేవలం 12 గంటలవ్యవధిలోనే 5లక్షల64వేలకు పెరిగిందన్నారు. ప్రకాశం బ్యారేజీలోకి వస్తున్న వరదప్రవాహాం 13వతేదీన ఎలాఉందో, 14 వ తేదీ ఉదయానికి కూడా అలానేఉంటే, వస్తున్ననీటిని దిగువకు వదలకుండా కావాలనే ప్రకాశం బ్యారేజీ గేట్లనుమూసి, ఎగువప్రాంతాల్లో నిల్వచేశారని పట్టాభిపేర్కొన్నారు. వస్తున్న నీటి పరిమాణంలో మార్పులేనప్పుడు, రాత్రికి రాత్రే 5లక్షలక్యూసెక్కులకు నీరు ఎలాపెరిగిందో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. నీటిని ప్రకాశం బ్యారేజీ ఎగువప్రాంతంలో నిల్వచేయబట్టే, రాత్రికి రాత్రి వరదనీటి ఉధృతి పెరిగిందని, ఏదో రకంగా అమరావతి ప్రాంతాన్ని ముంపునకు గురిచేయాలన్న కుట్రతోనే ప్రభుత్వం నీటిని తొక్కిపట్టిందన్నారు. కేవలం 12 గంటల వ్యవధిలోనే లక్షా98వేల క్యూసెక్కులుగా ఉన్న నీరు 5లక్షల64వేలక్యూసెక్కులకు ఎలా పెరిగిందో ప్రభుత్వం చెప్పాలన్నారు. కేవలం రాజధాని అమరావతిని ముంచడంకోసమే జగన్ ప్రభుత్వం ప్రకాశంబ్యారేజీ నుంచి నీటిని దిగువకు వదలలేదన్నారు. ఈ విధంగా అమరావతికి వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం పన్నినకుట్ర ప్రజలముందు బహిర్గతమైందన్నారు. అత్యంత కర్కశంగా, దారుణంగా ఒక్కసారిగా నీటిని కిందకు వదలబట్టే విజయవాడలోని కృష్ణలంక వంటి ప్రాంతాలు నీటమునిగాయన్నారు. 5లక్షల క్యూసెక్కుల నీటిని ఒక్కసారిగా వదలబట్టే, విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయన్నారు. అయితే ఈ ఆధారాల పై ఇప్పటి వరకు ప్రభుత్వం, ఎలాంటి కౌంటర్ ఇవ్వలేదు.

Advertisements