నూట ఇరవై అయిదు సంవత్సరాల చరిత్ర ఉన్న వాల్తేరు రైల్వే డివిజన్‌ను మరచిపోవాల్సిందేనని రైల్వే మంత్రి పీయూష్‌గోయల్‌ స్పష్టం చేశారు. ‘‘విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తే...వాల్తేరు డివిజన్‌ కావాలని అడుగుతారేమిటి?’’ అంటూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ ప్రశ్నించారు. రద్దుచేసిన వాల్తేరు డివిజన్‌ను పునరుద్ధరించబోమని తెగేసి చెప్పారు. ఎన్నికలప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తల (వాల్తేరు డివిజన్‌) లేని జోన్‌ ఇచ్చారని, దానివల్ల ప్రయోజనం ఏమిటని విశాఖలో విలేకరులు ప్రశ్నించగా, అదంతా టీడీపీ దుష్ప్రచారమని ఆయన కొట్టిపారేశారు.

loksabha 03042019

‘‘మూడు డివిజన్లతో కూడిన పెద్ద జోన్‌ ఇచ్చాం. దాని కేంద్రం విశాఖలో ఏర్పాటుచేశాం. జనరల్‌ మేనేజర్‌ను నియమించాం. ఇంత చేసినా, ఇంకా డివిజన్‌ కావాలని అడగడం చిన్నపిల్లాడి మనస్తత్వాన్ని తలపిస్తోంది. పెద్ద చాక్లెట్‌ చేతికి ఇస్తే...ఇంకో చిన్న ముక్క కూడా కావాలని ఏడ్చినట్లు ఉంది’’ అని వ్యాఖ్యానించారు. రద్దు చేసిన వాల్తేరు డివిజన్‌ను పునరుద్ధరిస్తారని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారని, ఆ ప్రక్రియ ఎప్పటిలోగా పూర్తవుతుందని ప్రశ్నించగా, మళ్లీ వాల్తేరు డివిజన్‌ను పునరుద్ధరించే అవకాశమే లేదని స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తుంటే...ఆ పథకాలకు సీఎం చంద్రబాబు తన పేరు పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు.

loksabha 03042019

చంద్రబాబుకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదని, తన సొంత సంస్థ హెరిటేజ్‌ అభివృద్ధికే ఆయన పాటు పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ రెండింటికీ రాష్ట్ర అభివృద్ధిపై అజెండా ఏమీ లేదని ఆరోపించారు. చంద్రబాబు, మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌, ఫరూక్‌ అబ్దుల్లాలది అవినీతిపరుల అనుబంధమన్న ఆయన, కాంగ్రెస్‌ మేనిఫెస్టో నిండా అభూత కల్పనలే ఉన్నాయని విమర్శించారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో అవినీతి రహిత పాలన అందించే ప్రధాని నరేంద్రమోదీకి మద్దతు పలకాలని, బీజేపీకిపట్టం కట్టాలని మేధావులను మంత్రి కోరారు. విజయనగరంలో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన మేధావుల ఆత్మీయ సమావేశంలో గోయల్‌ పాల్గొన్నారు. చంద్రబాబు పాలనకు చరమగీతం పలికేందుకు ప్రజలు కాపలాదారులు కావాలని మంత్రి కోరారు.

Advertisements