జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసిన విశాఖలోని గాజువాక నియోజకవర్గంలో పోలింగ్‌ సరళి ఉత్కంఠభరింతంగా సాగింది. ఆయన గెలుస్తారా? లేదా? అన్నది రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఆసక్తికర అంశంగా మారింది. మొత్తం 3,09,326 ఓటర్లతో జిల్లాలోనే అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న గాజువాకలో తెదేపా నుంచి పల్లా శ్రీనివాసరావు నుంచి తీవ్ర పోటీ ఎదురవుతుందని తొలుత ప్రచారం జరిగింది. అనూహ్యంగా వైకాపా అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి బలమైన పోటీనిచ్చారు. 2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా, 2014లో వైకాపా అభ్యర్థిగా పోటీచేసిన నాగిరెడ్డి సానుభూతి అస్త్రంగా ప్రచారం చేశారు. వయసురీత్యా పెద్దవారైన ఆయన ఇప్పుడు తాను గెలవకపోతే మరో ఐదేళ్ల తరువాత తాను పోటీ చేసే పరిస్థితి కూడా ఉండదని ఓటర్లకు చెబుతూ వచ్చారు.

pk 14042019

మరోవైపు వైకాపా వర్గీయులు గత అయిదు రోజులుగా భారీస్థాయిలో తాయిలాలు పంచారు. ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి వ్యూహం ప్రకారం వెళ్లారు. దీంతోపాటు పవన్‌కల్యాణ్‌కు గాజువాకలో ఆది నుంచి పలు అవాంతరాలు ఎదురవుతానే ఉన్నాయి. ఒక బహిరంగసభ రద్దు కావడం, వడదెబ్బ కారణంగా గాజువాకలో విస్తృత ప్రచారం చేసే అవకాశం దొరక్కపోవడం ఇబ్బందిగా మారాయి. గురువారం పోలింగ్‌ సందర్భంగా నెలకొన్న పరిస్థితులు కూడా పవన్‌ విజయావకాశాల్ని సంక్లిష్టం చేశాయని తెలుస్తోంది. చాలామంది పవన్‌ అభిమానులు పోలింగ్‌ బూత్‌లకు వచ్చినా.. ఈవీఎంలు మొరాయించడంతో కొందరు వెనక్కి వెళ్లిపోయారు. ఓటు వేయడానికి క్యూలైన్లలో గంటలపాటు నిరీక్షించాల్సిన పరిస్థితుల్లో చాలామంది నిష్క్రమించారు.

pk 14042019

మరోపక్క ఎండ కూడా తీవ్రంగా ఉండడంతో చాలామంది ఓటింగ్‌కు హాజరుకాలేదు. అయితే పవన్‌కు గంగవరం, అగనంపూడి, కూర్మన్నపాలెం, దువ్వాడ, మింది, వడ్లపూడి తదితర ప్రాంతాల నుంచి గట్టి మద్దతు లభించినట్టు తెలుస్తోంది. అలాగే తెదేపా అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గంలో సౌమ్యుడిగా, కష్టపడి పనిచేసే వ్యక్తిగా, పలు సమస్యల్ని సమర్థంగా పరిష్కరించిన నేతగా గుర్తింపు పొందారు. తెదేపాకున్న బలమైన ఓటుబ్యాంకు, తన అభిమానులు, తన నిర్ణయాల కారణంగా లబ్ధి పొందిన వారు ఓటేస్తే తాను సునాయాసంగా విజయం సాధిస్తానని పల్లా ధీమాగా ఉన్నారు.

Advertisements