కరోనాపై జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాతో ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించారు. అందరూ కలిసికట్టుగా ఈ మహమ్మారిని ఎదుర్కోవాలని.. ప్రతి ఒక్కరూ అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని ప్రజల్ని కోరారు. శాస్త్రవేత్తలు కూడా ఎలాంటి మార్గం కనిపెట్టలేకపోయారని.. ఏకాంతంగా ఉండటం వల్లే ఈ వైరస్​ను కట్టడి చేయొచ్చని అన్నారు. మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడాలని.. సూచించారు ప్రధాని. ‘‘ప్రపంచ మానవాళి మొత్తం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పుడిప్పుడే ఊరట లభించే అవకాశం లేదు. రెండో ప్రపంచ యుద్ధం కంటే పెద్ద విపత్తును ఎదుర్కొంటున్నాం. ప్రతిఒక్కరూ జాగరూకతతో ఉండటం అవసరం ఉంది. అందరం చేయిచేయీ కలిపి ఈ విపత్తును ఎదుర్కోవాలి. కొద్ది వారాలు మీ అందరి సమయం నాకు ఇవ్వాలని కోరుతున్నా. జనం కోసం జనం ద్వారా కర్ఫ్యూ.. మన ఇళ్లల్లో 60-65 ఏళ్లు దాటిన వృద్ధులను ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లనీయరాదు. జనతా కర్ఫ్యూ పాటించాలని పౌరులందరినీ కోరుతున్నా."

"ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు బయటకు రాకుండా కర్ఫ్యూ పాటిద్దాం. ఇది జనం కోసం జనం ద్వారా జనమే చేసుకునే కర్ఫ్యూ. ఆదివారం సంయమనంతో మనకు మనంగా విధించుకున్న కర్ఫ్యూ కరోనాపై అతిపెద్ద యుద్ధం. జనతా కర్ఫ్యూను ఆచరించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రావాలని కోరుతున్నా. రానున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు జనతా కర్ఫ్యూ సాధనంగా ఉపయోగపడుతుంది. జనతా కర్ఫ్యూ సందేశం, ఉద్దేశం ప్రజలందరికీ చేరవేయాలని కోరుతున్నా. ఈ సమయంలో మనకు కావాల్సింది సంయమనం. అవసరం లేకుండా ఇంట్లో నుంచి కాలు బయట పెట్టవద్దు. ప్రజలు పరస్పరం సామాజిక దూరం పాటించాలి. ప్రపంచ మహమ్మారిని ఎదుర్కోవడంలో సామాజిక దూరం ముఖ్యం."

"నిర్లక్ష్యంగా ఉండటం.. మనకు ఏమవుతుందనే ధోరణి విడనాడాలి. అవకాశం ఉన్నంత మేరకు వ్యాపారులు, ఉద్యోగులు ఇంట్లో నుంచే పనిచేయాలి. వైద్య ఆరోగ్య రంగం, మీడియాలో పనిచేసేవాళ్లు తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ రంగంలో పనిచేసేవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మనందరం చేయిచేయి కలిపి ఈ మహమ్మారిపై యుద్ధం చేయాలి. ఇది ఏ ఒక్కరితోనో పరిష్కారమయ్యేది కాదు. వచ్చే కొద్ది వారాలపాటు మీ సమయాన్ని నాకు ఇమ్మని కోరుతున్నా. ఈ మహమ్మారి నుంచి కాపాడేందుకు శాస్త్రవేత్తలు ఎలాంటి మార్గం కనిపెట్టలేకపోయారు. కరోనా మహమ్మారి విస్ఫోటనంలా విరుచుకుపడుతోంది. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల కంటే పెద్ద విపత్తును ఎదుర్కొంటున్నాం. ప్రపంచ మహమ్మారి నుంచి ఊరట లభించే అవకాశం ఇప్పుడిప్పుడే లేదు. ప్రతి ఒక్కరూ జాగరూకతతో ఉండటం అత్యంత అవసరం."

Advertisements