ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన డేటా పూర్తి సురక్షితంగా ఉందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి విజయానంద్‌, ఆర్టీజీఎస్‌ సీఈవో అహ్మద్‌ బాబు స్పష్టం చేశారు. ఏపీ డేటా చోరీకి గురైందంటూ వస్తున్న వదంతులను తీవ్రంగా ఖండించారు. మంగళవారం వారిద్దరూ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఆధార్‌ డేటా చోరీకి గురయ్యే అవకాశం లేదని విజయానంద్‌ స్పష్టం చేశారు. యూఐడీఏఐకి చెందిన సెంట్రల్‌ ఐడెంటిటీ డేటా డిపాజిటరీలో ఆధార్‌ డేటాను భద్రపరుస్తారని ఆయన చెప్పారు. ‘ప్రజాసాధికార సర్వేకు సంబంధించిన డేటా కూడా రాష్ట్రం వద్ద భద్రంగా ఉంది. ఈ డేటాను సంక్షేమ పథకాల అమలు కోసం ఏదైనా ప్రభుత్వ శాఖ కోరితే దానిని నేరుగా కాకుండా వెబ్‌సర్వీస్‌ ద్వారా అందజేస్తాం. దీనివల్ల డేటాను ఆ శాఖ అప్‌లోడ్‌ చేసుకోవడమే తప్ప డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉండదు.

rtgs 06022019

డేటా చోరీకి ఎవరైనా ప్రయత్నిస్తే మాకు తక్షణమే సమాచారం వస్తుంది. ప్రతినెలా డేటా భద్రతను పర్యవేక్షించి, అవసరమైన చర్యలు తీసుకుంటున్నాము. ఏపీ సైబర్‌ సెక్యూరిటీ ఆపరేషన్స్‌ సెంటర్‌ ద్వారా రాష్ట్రానికి సంబంధించి డేటా భద్రతను పర్యవేక్షిస్తున్నాం’ అని వివరించారు. వివిధ ప్రభుత్వ శాఖలు తమ సంక్షేమ పథకాల అమలును ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తాయని, అలాంటి సమయంలో ఆ శాఖలు తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఆయా సంస్థలతో పంచుకుంటే ఆ సంస్థలు నివేదికలు సిద్ధం చేస్తాయని విజయానంద్‌ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు మాత్రమే ప్రభుత్వం జన్మభూమి సభల్లో విడుదల చేస్తుందని ఆర్టీజీఎస్‌ సీఈవో అహ్మద్‌బాబు తెలిపారు. ప్రజాసాధికార సర్వేలో సేకరించిన డేటా, ఆధార్‌ ద్వారా వచ్చిన డేటా ఎక్కడా లీకయ్యే అవకాశం లేదని చెప్పారు. ‘సంక్షేమ పథకాల నిర్వహణ కోసం వివిధ శాఖలకు డేటాను ఎన్‌క్రిప్టెడ్‌ ఫామ్‌లో పంపుతాం. ఆ శాఖకు సంబంధించిన ఒక ఆథరైజ్డ్‌ అధికారికి మాత్రమే ఆ డేటాను డీక్రిప్ట్‌ చేసే కోడ్‌ ఇస్తాం. 2016 ఆధార్‌ చట్టం ప్రకారం.. వ్యక్తుల ఆధార్‌ నంబర్‌ను కూడా ప్రభుత్వశాఖలకు తెలియనివ్వకూడదు. అందుకే ఒక వ్యక్తికి సంబంధించిన ఆధార్‌ నంబర్‌కు 28 అంకెలతో కూడిన ఒక వర్చువల్‌ ఐడీ క్రియేట్‌ చేశాం. సంక్షేమ పథకాలు అమలుచేసే శాఖలకు కేవలం ఆ ఐడీ మాత్రమే ఇస్తున్నాం’ అని అహ్మద్‌బాబు తెలిపారు.

rtgs 06022019

మంత్రివర్గ సమావేశంలోనూ ఈ పరిణామాలపై విజయానంద్‌ మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని ఎవరో చోరీ చేశారన్న ఆరోపణలు పచ్చి అబద్ధం. ప్రభుత్వంలో ఏది రహస్యంగా ఉండాలో ఆ సమాచారం అంతా నూటికి నూరు శాతం పకడ్బందీగా ర క్షణలో ఉంది. ఆ డేటా అంతా క్లౌడ్‌లో ఉంది. దానిని ఎవరూ తీసుకోలేరు. ఈ డేటా సంరక్షణకు ప్రత్యేకంగా కోర్‌ డేటా అథారటీని నెలకొల్పాం. డేటా చౌర్యం జరగకుండా చూడటానికి సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ను సచివాలయంలో ఏర్పాటు చేశాం. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమాచారం రహస్యం కాదు. వాటిని ప్రతి గ్రామంలో బహిరంగంగా ప్రదర్శిస్తున్నాం. ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారుల సమాచారం ఆన్‌లైన్‌లో లభ్యమవుతున్నాయి. లబ్ధిదారుని ఆధార్‌ నంబర్‌ మరొకరికి తెలిసినా ఏం నష్టం లేదు. ఆ లబ్ధిదారుని వేలిముద్ర పడితే తప్ప అతని ఆధార్‌ ఖాతాలోకి వెళ్లలేరు. మేం ప్రతి శాఖకు లబ్ధిదారుల జాబితా అందచేశాం. అవేవీ రహస్యం కాదు. ఆ వివరాలు తెలుసుకోవడం డేటా చౌర్యం కిందకు రాదు’ అని ఆయన తేల్చిచెప్పారు.

 

 

Advertisements