రాజధాని అమరావతిలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల నిర్మాణంలో మరో ముందడుగు పడింది. 50 అంతస్తులుగా నిర్మిస్తున్న ముఖ్యమంత్రి కార్యాలయ భవనానికి డయాగ్రిడ్‌ స్ట్రక్చర్‌ నిర్మాణంలో భాగంగా తొలి కాలమ్‌ను (మధ్యలో ఖాళీగా, చతురస్రాకారంలో రూపొందించిన పొడవైన ఇనుప స్తంభం) సోమవారం అమర్చారు. గుజరాత్‌లో సర్దార్‌ వల్లభ్‌భాయి పటేల్‌ విగ్రహానికి (స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ) స్టీల్‌ ఫ్రేం వర్క్‌ పనులు చేసిన.... ఎవర్సెండాయ్‌ సంస్థ వీటిని సరఫరా చేస్తోంది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలకు అమరావతిలో 5 టవర్లు నిర్మిస్తున్నారు. వీటిలో 3, 4, 5 టవర్లకు ఎవర్సెండాయ్‌, 1, 2 టవర్లకు జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ సంస్థలు ఈ కాలమ్‌లను సరఫరా చేస్తున్నాయి.

secretariat 16042019 1

అమరావతిలోని హెచ్‌వోడీ అండ్‌ సెక్రటేరియల్‌ టవర్లలో 4 ఒక్కొక్కటి 40 అంతస్థులతోనూ, మిగిలిన ఒకటి 50 అంతస్థులతో (ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి కార్యాలయాలు కొలువు దీరే జీఏడీ టవర్‌) నిర్మితమవనున్న సంగతి తెలిసిందే. సాంప్రదాయక భవనాల్లోని పిల్లర్ల మాదిరి కాకుండా భారత్‌లోనే తొలిసారిగా డయాగ్రిడ్‌ విధానంలో నిర్మితమవుతున్న అత్యంత భారీ సౌధాలుగా ఇవి చరిత్రలో నిలిచిపోనున్నాయి. ఇప్పటికే వీటికి సంబంధించిన భారీ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ ప్రక్రియను దిగ్విజయంగా ముగించిన సీఆర్డీయే ఇంజినీరింగ్‌ విభాగాధికారులు తదుపరి చర్యగా ఈ టవర్ల డయాగ్రిడ్‌ స్టీల్‌ కాలమ్స్‌ అమరిక పనులను చేపట్టారు. ఇందులో భాగంగా జీఏడీ (టవర్‌ నంబర్‌ 5) మరియు 3వ టవర్‌కు సంబంధించిన డయాగ్రిడ్‌ కాలమ్స్‌ ఏర్పాటు చేస్తున్నారు.

secretariat 16042019 1

స్ట్రక్చరల్‌ స్టీల్‌ ఫ్యాబ్రికేషన్‌లో ప్రపంచంలోని అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఎవర్‌సెండాయ్‌ సంస్థ ఈ పనులను చేపట్టింది. దుబాయ్‌కు చెందిన ఈ సంస్థకు బుర్జ్‌ ఖలీఫా, మలేసియాలోని పెట్రోనాస్‌ టవర్‌ 2, ఖతార్‌లోని ఖలీఫా ఒలింపిక్‌ స్టేడియం, సింగపూర్‌లోని రిపబ్లిక్‌ ప్లాజా, సౌదీలోని కింగ్‌డమ్‌ సెంటర్‌ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక నిర్మాణాలను చేపట్టిన అనుభవం ఉంది. సెక్రటేరియట్‌ టవర్లలో అమర్చిన డయాగ్రిడ్‌ కాలమ్స్‌ ఒక్కొక్క దాని బరువు 17.80 టన్నులు! ఈ350బీఆర్‌ గ్రేడ్‌ అనే అత్యంత నాణ్యమైన స్టీల్‌తో తమిళనాడులో వీటిని తయారు చేసి, అక్కడి నుంచి భారీ వాహనాల్లో అమరావతికి చేర్చారు. జీఏడీ టవర్‌లో ఇలాంటి భారీ కాలమ్స్‌ మొత్తం 512 అమర్చనున్నారు. కాగా.. మొత్తం 5 సెక్రటేరియట్‌ టవర్లలో మూడింటికి సంబంధించిన డయాగ్రిడ్‌ కాలమ్స్‌ అమరికను ఎవర్‌సెండాయ్‌ జరపనుండగా, మిగిలిన 2 టవర్లవి జేఎ్‌సడబ్ల్యూ సంస్థ చేపట్టనుంది.

Advertisements