ప్రస్తుతం రాష్ట్రంలో అందరి దృష్టి రాష్ట్ర ఎన్నికల సంఘం పైనే ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధం నేపధ్యంలో, ఎన్నికల కమిషన్, స్థానిక సంస్థల ఎన్నికల పై ఏమి నిర్ణయం తీసుకుంటుందా అని అందరూ ఆలోచిస్తున్నారు. ఈ నేపధ్యంలో వచ్చిన వార్తలు ప్రకారం చూస్తుంటే, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ విషయంలో వ్యూహాత్మికంగా వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ఎన్నికల కమిషన్ పై విరుచుకు పడుతున్నారు. ఈ నేపధ్యంలో, ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం విమర్శలు చేస్తుంది. అందుకే ఈ విషయం పై కోర్టు నిర్ణయానికే వదిలేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై, గత ఏడాది వేసిన కేసు విషయంలో, ఇప్పుడు వాదనలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే హైకోర్టు, ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్నికల నిర్వహణ పై అభిప్రాయం చెప్పండి అంటూ, ఎన్నికల కమిషన్ ని కోరింది. వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలే జరుగుతున్నాయి కాబట్టి, మీకు అభ్యంతరం ఏమిటని ప్రశ్నించింది. దీని పై తమకు పూర్తి స్థాయిలో అఫిడవిట్ రూపంలో వివరాలు ఇవ్వాలని కోరింది. ఈ నేపధ్యంలోనే, రాష్ట్ర ఎన్నికల సంఘం, ఈ విషయం పై కసరత్తు ప్రారంభించింది. ముందుగా, రాష్ట్ర హెల్త్ సెక్రటరీని పిలిపించి, రాష్ట్రంలో పరిస్థితి పై ఆరా తీసింది. ఆ తరువాత రోజు అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకుంది. వైసీపీ పార్టీ తప్ప, అన్ని ప్రముఖ పార్టీలు, ఈ సమావేశానికి వచ్చి, తమ అభిప్రాయం తెలిపాయి.

అయితే నవంబర్ 4న ఈ కేసు మళ్ళీ హైకోర్టులో వాయిదా వస్తుంది. ఆ సమయం లోపే, ఎన్నికల కమిషన్ తరుపున అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న విమర్శలకు కౌంటర్ గా, వ్యూహాత్మికంగా వెళ్ళాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయలు తన అఫిడవిట్ లో చెప్పి, ఆలాగే ప్రభుత్వం ఇచ్చిన నివేదికను కూడా అఫిడవిట్ లో చెప్పి, తాము దేనికైనా సిద్ధం అని, కోర్టు నిర్ణయాన్ని బట్టి నడుచుకుంటాం అని చెప్పే అవకాసం ఉంది. మెజారిటీ రాజకీయ పార్టీలు ఒప్పుకోవటంతో, కోర్టు ఏమి చెప్తుందో చూడాలి. మరో పక్క స్కూల్స్ కూడా ప్రారంభిస్తున్న ఏపి ప్రభుత్వం, ఎన్నికల నిర్వహణ పై మాత్రం వెనకడుగు వేస్తుంది. తాము ఇప్పుడు ఎన్నికలు జరపలేం అని ఎలక్షన్ కమిషన్ కు తేల్చి చెప్పింది. తమ ఉద్యోగులు వైరస్ బారిన పడతారని అంటుంది. ఈ నేపధ్యంలో కోర్టు ఏమి డైరెక్షన్స్ ఇస్తుంది ? గత ఎన్నికల నోటిఫికేషన్ ఏమి అవుతుంది ? గత ఏకాగ్రీవాలు ఏమి అవుతాయి ? అసలు ఎన్నికలు జరుగుతాయా ? లేక నిమ్మగడ్డ సర్వీస్ అయిపోయేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరపదా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు దొరుకుతుందో మరి ?

Advertisements