ప్రజా చైతన్యయాత్రలో భాగంగా చంద్రబాబు విశాఖ పర్యటనకు పోలీసులు అనుమతిచ్చారని, అటువంటప్పుడు ఆయన యాత్రకువెళ్లడానికి ఆలోచించాల్సిన అవసరమేముంటుందని టీడీపీ సీనియర్ నేత, పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పర్యటనకు పోలీసులు ఒప్పుకున్నాక, తానేదో విశాఖను బాగుచేసినట్లు, ఉత్తరాంధ్రను ఉద్ధరించినట్లు భావిస్తూ, మంత్రి బొత్స పర్యటనను అడ్డుకుంటానని చెప్పడం, వైసీపీనేతలారా మీరంతా అడ్డుకోండని పిలుపునివ్వడం దేనికి సంకేతమని వర్ల ప్రశ్నించారు. దేశంలో పిచ్చి బొత్సకే అలా మాట్లాడటం సాధ్యమైందని, రాజ్యాంగంపై ప్రకటన చేశాక, మామూలుగా మతి ఉన్నవారెవరూ అలాంటిప్రకటనలు చేయరని రామయ్య తెలిపారు. బొత్సప్రకటన తర్వాత పోలీసులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని, శాంతిభద్రతలు కాపాడాలనే సదుద్దేశంతో వారు పనిచేసి ఉండేవారని, బొత్సను, ఇతరవైసీపీనేతలను ముందస్తు అరెస్ట్ లు చేసి ఉండాల్సిందన్నారు. చంద్రబాబు గతంలో ఆత్మకూరు పర్యటనకు వెళుతుంటే, శాంతిభద్రతల సాకుతో ఆయన ఇంటిగేటుకు తాళ్లు కట్టి నిరోధించిన పోలీసులు, బొత్సను, ఇతర వైసీపీనేతలను ఎందుకు నిర్బంధించలేదో సమాధానం చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు.

వైసీపీవారిని కట్టడిచేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారన్నారు. చంద్రబాబునాయుడి పర్యటనకు ఒకరోజు ముందు, డీజీపీ సవాంగ్ ముఖ్యమంత్రితో రహస్యంగా మాట్లాడాడని, వారిసంభాషణల్లోంచే చంద్రబాబు పర్యటనను ఎలాగైనా అడ్డుకొని తీరాలన్నదురాలోచన వచ్చిందన్నారు. విశాఖ వాసులెవరూ చంద్రబాబుని అడ్డుకోరన్న వర్ల, హుద్ హుద్ తుఫాన్ వచ్చినప్పుడు విశాఖ నగరాన్ని కాపాడటంకోసం తన రెండుచేతులు అడ్డుపెట్టిన వ్యక్తిగా... ఆయనపట్ల ఆనగర వాసులందరికీ ఉన్న సదభిప్రాయమే అందుకు కారణమన్నారు. చంద్రబాబు పాదం విశాఖలో పెట్టకుండా ప్రభుత్వమే కుట్ర పన్నిందన్నారు గతంలో విశాఖలో జగన్మోహన్ రెడ్డి కొవ్వొత్తుల ర్యాలీ చేపడతానంటే, పెట్టుబడుల సదస్సు జరుగుతున్న దృష్ట్యా, ఆనాడు ఆయనకు పోలీసులు అనుమతి నిరాకరించడం జరిగిందన్నారు. టీడీపీ కార్యకర్తలెవరూ ఆనాడు, జగన్ ను అడ్డుకోలేదని, దాన్ని మనసులో పెట్టుకున్న ముఖ్యమంత్రి, కేవలం వీధిరౌడీలా, దుర్మార్గపు ఆలోచనలు చేసి, చంద్రబాబుని అడ్డుకునేలా యంత్రాంగం నడిపాడన్నారు. వైసీపీ నేతలు, వారు తీసుకొచ్చిన కిరాయివ్యక్తులే చంద్రబాబుని అడ్డుకున్నారన్న రామయ్య, అందుకు సంబంధించిన చిత్రాలను, దృశ్యాలను విలేకరుల ఎదుట ప్రదర్శించారు. చంద్రబాబు విశాఖలో అడుగుపెడితే పెట్రోల్ పోసుకొని, నిప్పంటించుకొని చస్తానంటూ, హల్ చల్ చేసిన జెట్టి రామారావు, స్వయంగా మంత్రి బొత్సకు బంధువని వర్ల స్పష్టంచేశారు. రామారావు గత జీవితమేమిటో విశాఖ వాసులందరికీ తెలుసునని, ఆయన బొత్సకు ఎలాంటి బంధువో.. రామారావు సేవలు పొందినందుకు గాను కృతజ్ఞతతో బొత్స ఆయనతో బంధుత్వం కలుపుకున్నాడని వర్ల దుయ్యబట్టారు.

మరో మంత్రి అవంతి శ్రీనివాస్ కు రామరావు ముఖ్య అనుచరుడని, ఆయనకూడా సదరు జెట్టి వారి సేవలు పొంది ఉండవచ్చన్నారు. పెట్రోల్ పోసుకొని చనిపోతానంటూ వీరంగం వేసిన రామారావుని ఆపి తనిఖీచేస్తే, శీతలపానీయమైన ఫాంటా ను సీసాలో పోసి, పెట్రోల్ అని నమ్మించేలా ఓవరాక్షన్ చేసినట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఇద్దరు మంత్రులకు అతిసన్నిహితుడైన వ్యక్తి, కూల్ డ్రింక్ ను సీసాలో పొసుకొని, చాలా నిస్సిగ్గుగా ప్రవర్తిస్తే అతనిపై పోలీసు వారు ఏం చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. విశాఖపట్నం విమానాశ్రయంలో చంద్రబాబుని అడ్డుకున్న అన్నల జాబితాలో గాజువాక, వేమూరు ఎమ్మెల్యేల కుమారులు తిప్పల వంశీరెడ్డి, మేరుగ కిరణ్ నాగ్ లు కూడా ఉన్నారని, ఈ విషయం వారి అభిమానులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్ లతోనే బయటపడిందన్నారు. వైసీపీవారే లేరని పిచ్చికూతలు కూస్తున్న బొత్స, అవంతి, రోజా, ఇతర వైసీపీనేతలు, తమపార్టీ ఎమ్మెల్యేల కుమారులపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని వర్ల నిలదీశారు. అర్థరాత్రివేళ రాజధాని మహిళల ఇళ్లచుట్టూ తిరిగే పోలీసులు కిరణ నాగ్ ను, తిప్పల వంశీరెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలన్నారు. కందుకూరి కాంతారావు అలియాస్ కత్తి కాంతారావు అనే మరోప్రముఖవ్యక్తి కూడా చంద్రబాబు పర్యటనలో గోబ్యాక్ ప్లకార్డులు పట్టుకున్నాడని, ఆయన వైజాగ్ వైసీపీ స్టూడెంట్ యూనియన్ కి చెందిన నేత అని వర్ల చెప్పారు. (కాంతారావు ప్లకార్డు పట్టుకొని కూర్చున్న ఫొటోను విలేకరులకు చూపించారు.) జుట్టంతా ఊడిపోయి, 60ఏళ్ల వాడిలా, తన క్లాస్ మేట్ లా కనిపిస్తున్న కాంతారావు విద్యార్థివిభాగం నాయకుడు ఎలా అవుతాడో, కందుకూరి నుంచి ఆయన విశాఖకు ఎందుకొచ్చాడో శ్రీమతి రోజా చెబితే బాగుంటుందని రామయ్య చురకలు వేశారు.

చంద్రబాబుపై కడుపుమండి అందరూ ఆయన్ని అడ్డుకున్నారంటున్న రోజా, కందుకూరులో ఉండే కాంతారావు కి కడుపుమండితే విశాఖ ఎలా వచ్చాడో, ఎందుకొచ్చాడో చెప్పాలన్నారు. టీడీపీనేత గంటాపై పోటీచేసి ఓడిపోయిన కే.కే.రాజు చంద్రబాబు పర్యటనలో పోలీసులను తోసుకుంటూ, ముందుకు ఉరికాడని, అయినాకూడా వారు చోద్యం చూశారుతప్ప, ఆయన్ని అరెస్ట్ చేయలేదన్నారు. చంద్రబాబుని అడ్డుకోవడానికి తాను వేమూరు నియోజకవర్గం నుంచి వచ్చానని, సాక్షి టీవీతో ఒకవ్యక్తి చెప్పాడని, ఆ వ్యక్తికి విశాఖలో ఏం పని అని, ఎవరు ఎంతసొమ్మిస్తే అతను అక్కడకు వచ్చాడో రోజా అక్క సమాధానం చెప్పాలన్నారు. రామారావు, కాంతారావు, వంశీరెడ్డి, కిరణ్ నాగ్, కే.కే.రాజు, వారి వెంట నడిచిన ఇతర వైసీపీనేతలు, కార్యకర్తలు ఎందుకు చంద్రబాబుని అడ్డుకున్నారో, ఎవరు పంపితే వారు ఆపనిచేశారో మంత్రి బొత్స, అవంతి, రోజా, అంబటి సమాధానం చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందస్తుగా, వివిధ ప్రాంతాలనుంచి డబ్బులు, మద్యం ఇచ్చిమరీ కిరాయి మూకలను పోగుచేసిందని, వారందరినీ చంద్రబాబుపైకి నడిపించడంకోసం వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర కీలకనేతలకు బాధ్యతలు అప్పగించిందన్నారు. చంద్రబాబుని లక్ష్యంగా చేసుకొని, ప్రభుత్వం ఎందుకింతగా శ్రమించిందో, బరితెగించి అడ్డదారులు ఎందుకు తొక్కిందో బహిర్గతం చేయాలని రామయ్య మండిపడ్డారు. చంద్రబాబుని ఆపడానికి డబ్బులు, మద్యం, ఆహరపొట్లాలు పంచేబదులు, పోలీసులే ఆయనకు అనుమతులు నిరాకరించి ఉంటే బాగుండేదన్నారు. ప్రభుత్వం జరిపిన నేరపూరిత కుట్రలోభాగంగానే, చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలన్న దురుద్దేశంతోనే ఈ తతంగ మంతా నడిపారన్నారు. రాజధాని మహిళలు గులాబీలిచ్చి, జై అమరావతి అనమని కోరినందుకే, వారిని అరెస్ట్ చేసి, ఈడ్చుకెళ్లిన పోలీసులు, చంద్రబాబు పర్యటనలో వీరవిహారం చేసిన వైసీపీనేతలను ఎందుకు అరెస్ట్ చేయలేదో, చేయకపోతే ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలన్నారు.

Advertisements