అధికారంలోకి రాకముందు విద్యార్థులను, యువతను మోసగించిన జగన్, అధికారంలోకి వచ్చాక వారికి ఇచ్చిన ఏ ఒక్కహామీని నెరవేర్చకుండా, ఆయా వర్గాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరింత నయవంచనకు గురిచేస్తున్నాడని, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. సోమవారం ఆయన, టీఎన్ఎస్ఎఫ్ నేతలతో కలిసి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి రాకముందు, వివిధ సందర్భాలలో విద్యార్థులకు అన్నివేళలా అండగా ఉంటానని, వారి చదువులకు అవసరమైన సమస్త సౌకర్యాలను అందిస్తానని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక ఆ హామీలన్నీ తుంగలో తొక్కాడన్నారు. పేద విద్యార్థినీ, విద్యార్థులకు ఏడాదికి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఇస్తానని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన జగన్, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదన్నారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ముగియడానికి ఇంకా నెలరోజులే సమయమున్నా, జగన్ ఇచ్చినహామీ ప్రకారం ఏ ఒక్క విద్యార్థికి డబ్బులు అందలేదన్నారు. ప్రతిఏటా ఒక్కో విద్యార్థికి రూ. 1,50,000 ఇస్తానన్న జగన్, నేడు వసతి దీవెన కార్యక్రమం పేరుతో, అరకొరగా రూ.7,500 ఇవ్వడం, ఆ కొద్దిమొత్తం కూడా అతితక్కువ మందికే ఇవ్వడం ఎంతవరకు సమంజసమో, ముఖ్యమంత్రే చెప్పాలని రవీంద్ర డిమాండ్ చేశారు.

ఇప్పటివరకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, మెస్ బిల్లులు చెల్లించలేదని, అవి అందక విద్యార్థిలోకం నానా అగచాట్లు పడుతున్నా జగన్ ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమన్నారు. మేనిఫెస్టోలో పేదవిద్యార్థుల చదువులకు ఎంతఖర్చయితే, అంత మొత్తం తమ ప్రభుత్వం భరిస్తుందని, కాస్మొటిక్ ఛార్జీల కింద అదనంగా ఏటా రూ.20వేలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన జగన్, ఇప్పుడెందుకు ఇలా కప్పదాటు వైఖరి అవలంభిస్తున్నాడని రవీంద్ర దుయ్యబట్టారు. రూ.లక్షన్నరపైగానీ, అదనంగా ఇస్తానన్న రూ.20వేలపైగానీ, ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పష్టమైన ప్రకటన లేదని, అసలుకి, కొసరకు ఎసరుపెట్ట్టిన వ్యక్తిగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడన్నారు. విద్యా సంవత్సరం ముగింపుదశకు వచ్చాక, అరకొర చెల్లింపులు చేస్తూ, వసతిదీవెన పేరుతో జగన్, తనకుతానే డబ్బాలు కొట్టుకోవడం సిగ్గుచేటన్నారు. గతంలో చంద్రబాబునాయుడు ఐటీఐ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసించే 16లక్షల మంది విద్యార్థులకు సకాలంలో ఉపకారవేతనాలు అందచేస్తే, జగన్ వచ్చాక ఆ సంఖ్యని 11 లక్షలకు కుదించాడన్నారు. జగన్ నిర్ణయం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులకు నష్టం చేకూరుతోందని, అమ్మఒడి పథకాన్ని కూడా డిగ్రీ, ఇతర అనుబంధ, వృత్తి విద్యా కోర్సులు అవలసంభిస్తున్న విద్యార్థులకు ముడిపెట్టి, కుటుంబంలో ఒక్కరికే న్యాయం చేస్తాననడం జగన్ చౌకబారుతనా నికి నిదర్శనమన్నారు.

గతంలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను రూ.35వేల నుంచి రూ.40 వేలకు చంద్రబాబు ప్రభుత్వం పెంచితే, దాన్ని ఎంతమొత్తమైతే అంతమొత్తం ఏకకాలంలో చెల్లిస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చిన జగన్, ఇప్పుడెందుకు దాన్ని రూ.45వేలకే పరిమితం చేసి, విద్యార్థుల సంఖ్యను ఎందుకు తగ్గించాడో సమాధానం చెప్పాలన్నారు. ఈ విధంగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను నయవంచనకు గురిచేయడం ద్వారా జగన్ సర్కారు జగనన్న వసతిదీవెన పేరుతో నయా మోసానికి తెరలేపిందన్నారు. జగన్ చర్యల వల్ల అటు విద్యార్థులతో పాటు, వారి తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నాయని, పరీక్షలు దగ్గర పడుతుండటంతో ఫీజులు చెల్లిస్తేనే, హాల్ టిక్కెట్లు, సర్టిఫికెట్లు ఇస్తామని, కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. మెస్ బిల్లులను రూ. 1450పెంచుతామని చెప్పిన జగన్, 9నెలలైనా కూడా ఒక్క విద్యార్థికి కూడా పెంపుతో సంబంధంలేకుండా పాతమొత్తాలతో కలిపికూడా ఆబిల్లులు చెల్లించలేదన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు నిలిపివేయడం, మెస్ బిల్లులు చెల్లించకపోవడం, కాస్మొటిక్ ఛార్జీలు ఆపేయడం, తమ్ముడికో, చెల్లిలికో అమ్మఒడి డబ్బులిస్తే, పెద్దచదువులు చదివే వారి అన్నయ్యలకు, అక్కలకు డబ్బులివ్వకపోవడం వంటి చర్యలతో, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని విద్యార్థిలోకాన్ని నిలువునా మోసగించడన్నారు.

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నభోజనం పథకాన్ని ఆపివేయడంద్వారా, కళాశాల విద్య ఆరంభంలోనే జగన్ డ్రాపవుట్స్ సంఖ్య పెరిగేలా చేశాడన్నారు. అదేవిదంగా విదేశీ విద్యకోసం గత ప్రభుత్వం, అన్ని వర్గాల వారికి సాయం చేసిందని, ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యాపథకం, విదేశీ విద్యాదరణ పథకాల కింద రూ. 10లక్షల వరకు సాయం చేసిందన్నారు. ఆయా పథకాల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు విద్యార్థులు లబ్దిపొందారని, గత ప్రభుత్వంలో ఆయాపథకాల ద్వారా విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లినవారికి కూడా జగన్ సర్కారు సాయాన్ని నిలిపివేసిందన్నారు. గ్రూప్2, సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉచితంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ ప్రభుత్వం, ఆయా విద్యార్థులకు రూ.10వేలవరకు స్టయిఫండ్ ఇవ్వడంతోపాటు, కోచింగ్ కేంద్రాలకు ఒక్కో విద్యార్థికి రూ.లక్ష వరకు అందచేస్తే, జగన్ వచ్చాక ఆ పథకమే మరుగున పడిందన్నారు. నైపుణ్యాభివృద్ధి పథకం ధ్వారా టీడీపీ ప్రభుత్వం, 1,75,000 మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పించిందని, జగన్ వచ్చాక దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడన్నారు. నిరుద్యోగ భృతి కింద, టీడీపీ ప్రభుత్వం 6లక్షల మందికి నెలనెలా భృతిని అందచేస్తే, జగన్ అధికారంలోకి వచ్చాక, నిరుద్యోగులను రోడ్డున పడేశాడన్నారు. 9వ తగరతి చదివే విద్యార్థులకు సైకిళ్లు అందచేయడం, ప్రతిఏటా మెగాడిస్సీ నిర్వహించడం వంటి పనులన్నీ, చంద్రబాబు ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగిస్తే, జగన్ సీఎం అయ్యాక, వాటన్నింటినీ అటకెక్కించడాని రవీంద్ర మండిపడ్డారు.

Advertisements