ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోరు తారస్థాయికి చేరింది. అధికార, ప్రతిపక్షాల పరస్పర విమర్శలతో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న సమయంలో ప్రచార జోరును పెంచేందుకు ఇప్పటికే 30 మంది స్టార్‌ క్యాంపెయినర్లను తెదేపా రంగంలోకి దించింది. సీఎం చంద్రబాబు ఓవైపు సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తూనే మరోవైపు ప్రచార వ్యూహాలు రచిస్తున్నారు. తనకున్న రాజకీయ అనుభవంతో జాతీయ స్థాయి నేతలను ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగం చేయడంలో సఫలీకృతమయ్యారు. భాజపా యేతర కూటమిలో భాగంగా ఉన్న రాజకీయ పార్టీల అగ్రనేతలను ఏపీలో ప్రచారానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ తరుణంలో తెదేపా ఎన్నికల ప్రచారంలో మరింత జోష్‌ రానుంది.

star campaginers 27032019

సెక్యులర్ పార్టీల ప్రచారానికి తానెప్పుడూ సిద్ధమేనని, ఏపీలో చంద్రబాబు తరఫున ప్రచారం చేయనున్నానని చెప్పిన మాజీ ప్రధాని దేవెగౌడ బాటలోనే పలువురు జాతీయ స్థాయి ప్రముఖులు తెలుగుదేశం పార్టీ ప్రచారానికి క్యూలు కడుతున్నారు. బీజేపీకి, వైసీపీకి వ్యతిరేకంగా చంద్రబాబు తరఫున టీడీపీకి ప్రచారం చేయడం ద్వారా జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతను మరోసారి చాటేందుకు ఈ నేతలు సిద్ధమవుతున్నారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రాయలసీమలోని కడప, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా మంగళవారంనాడు పర్యటించగా, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పర్యటన తేదీలు కూడా ఖరారయ్యాయి.

star campaginers 27032019

ఈనెల 28, 31 తేదీల్లో మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌ టీడీపీ తరఫున విజయవాడ, వైజాగ్‌లో ప్రచారం చేయనున్నారు. కాగా, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, మాజీ ప్రధాని దేవెగౌడ, రాజకీయ ప్రముఖులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ తదితరులు సైతం ఏపీలో టీడీపీ ప్రచారానికి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 11న ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దాదాపు 10 మంది అగ్రనేతలు చంద్రబాబుకు అండగా ప్రచారంలో పాల్గొననున్నారు. రోడ్‌షోల్లోనూ, బహిరంగ సభల్లోనూ ప్రసంగించనున్నారు. దేవెగౌడ, మమతా బెనర్జీ, శరద్‌పవార్‌, అఖిలేష్‌ యాద వ్‌, ఫరూక్‌ అబ్దుల్లా, స్టాలిన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, అరుణ్‌శౌరి ఈ జాబితాలో ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ కూడా టీడీపీకి మద్దతుగా రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. ఏప్రిల్‌ 2న ఆయన నెల్లూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొనే అవకాశాలున్నాయి.

Advertisements