రాజకీయ నాయకులు ఏదైనా పర్యటన చెయ్యాలి అంటే, ముందుగా పోలీస్ వారి పర్మిషన్ తీసుకుంటారు. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి, పర్మిషన్ ఇస్తారు పోలీసులు. ఒక్కోసారి, షరతులు కూడా పెడతారు. ఒకసారి పర్మిషన్ ఇచ్చారు అంటే, ఆ పర్యటన బాధ్యత పోలీసులే తీసుకువాలి. ఈ రోజు చంద్రబాబు విశాఖ, విజయనగరం జిల్లాలో ప్రజాచైతన్య యాత్ర కోసం, టిడిపి శ్రేణులు, పోలీసులను కలవటం, షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. 50 మంది నాయకులు మాత్రమే ఉండాలని షరతు పెట్టారు. ఆ అనుమతి ప్రకారం, చంద్రబాబు గారు, ఈ రోజు వైజాగ్ వచ్చారు. అయితే అనూహ్యంగా అక్కడ వైసీపీ అల్లరి మూకలు వచ్చి, వీరంగం సృష్టించాయి. గుడ్లు, రాళ్ళు, టమాటాలు, చెప్పులు వేసి వీరంగం సృష్టించారు. 50 మందిని మాత్రమే అనుమతి ఇస్తాం అని చెప్పిన పోలీసులు, మరి అంత మంది వైసీపీ నాయకులను ఎలా అనుమతి ఇచ్చారు అంటే, ఇప్పటికీ ఆ ప్రశ్నకు సమాధానం లేదు. జెడ్ ప్లస్ భద్రత ఉన్న నాయకుడు పట్ల పోలీసులు ఇలా ఎందుకు ప్రవర్తించారో అర్ధం కావటం లేదు.

ఇక తరువాత, నాలుగు గంటల పాటు, వైసీపీ మూకలు, చంద్రబాబుని నిర్బందిచాయి. అయితే అనూహ్యంగా పోలీసులు మాత్రం చోద్యం చేస్తూ కూర్చున్నారు. జెడ్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తిని నాలుగు గంటల పాటు రోడ్డు పై, వైసీపీ మూకలు అడ్డుకుంటే, వారిని ఏమి అనకుండా, పోలీసులు వచ్చి చంద్రబాబుని అరెస్ట్ చేసారు. దీంతో తెలుగుదేశం నేతలు ఆశ్చర్య పోయారు. పర్మిషన్ ఇచ్చి, ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చేలా చేసి, రోడ్డు మీద అడ్డుకునేలా ప్లాన్ చేస్తే, చంద్రబాబుని అడ్డుకున్న వారిని, అరెస్ట్ చెయ్యకుండా, చంద్రబాబుని ఎదురు ఆరెస్ట్ చెయ్యటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. అమరావతిలో రోజాని అడ్డుకున్నారని, ప్రజల పై లాఠీ చార్జ్ చేసి, 400 మంది పై కేసులు పెట్టిన పోలీసులు, చంద్రబాబు విషయంలో రివర్స్ లో చేసారు. మరి ఎవరి ఒత్తిడితో ఇలా చేసారో ?

అంతకు ముందు తెదేపా అధినేత చంద్రబాబును పోలీసులు వాహనం నుంచి కిందకు దించారు. విమానాశ్రయంలోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా నిరాకరించారు. వాహనం దిగిన తర్వాత చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎలా తనను అడ్డుకుంటారని ప్రశ్నించారు. విశాఖ పర్యటనకు వస్తే.. తమపై దారుణంగా ప్రవరిస్తున్నారని తెదేపా అదినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనకు అనుమతి తీసుకున్నామని గుర్తు చేశారు. విశాఖ పర్యటనలో తమపై వైకాపా శ్రేణులు దాడి చేశారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. గంట, రెండు గంటలు ఆగితే పంపిస్తామని పోలీసులు చెప్పారని... ఇప్పుడేమో వెనక్కి వెళ్లాలని చెబుతున్నారని పేర్కొన్నారు. ఏ చట్టం కింద వెనక్కి వెళ్లాలని చెబుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తాను చట్టాన్ని ఉల్లంఘించనని.. పూర్తిగా సహకరిస్తానని అన్నారు. న్యాయపరంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. విశాఖలో భూకబ్జాలు జరిగాయన్న చంద్రబాబు.. నిజమో? కాదో? ప్రజలే తేలుస్తారన్నారు.

Advertisements