రాష్ట్రంలో మరింత పటిష్టంగా లాక్​డౌన్ అమలు చేయాలని జగన్​ అధికారులను ఆదేశించారు. నిత్యావసరాలను అధిక ధరలకు అమ్మితే వారిని జైలుకు పంపాలని అధికారులకు నిర్దేశించారు. ప్రతి దుకాణం వద్ద ధరల పట్టిక ప్రదర్శించాలని,ఫిర్యాదు చేయాల్సిన కాల్ సెంటర్ నంబర్ కూడా పట్టికలో పొందుపరచాలని చెప్పారు. రేషన్​ దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్బంగా నిత్యావసరాలు కొనుగోలు సమయాన్ని కూడా మార్చారు. పట్టణాలు, నగరాల్లో ఉదయం 6 నుంచి 11 వరకు, మిగతా ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనుగోలుకు అనుమతినిచ్చారు. గ్రామ వాలంటీర్లు సర్వే పటిష్టంగా ఉండాలని... ప్రతి కుటుంబం వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సీఎం సూచించారు. అర్బన్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్న ఆయన, ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక, అదనపు సిబ్బందిని నియమించాలని తెలిపారు.

వ్యవసాయం, ఆక్వా రంగాల్లో సామాజిక దూరం పాటిస్తూ.. కార్యకలాపాలు కొనసాగించాలన్నారు. రైతులు, ఆక్వారైతులకు కనీస గిట్టుబాటు ధర అందేలా చూడాలని.. జగన్​ అధికారులను ఆదేశించారు. వలస కూలీలు, కార్మికులకు షెల్టర్లలో మెనూ ప్రకారం మంచి భోజనం పెట్టాలన్నారు. అత్యవసర సర్వీసులకు ఇబ్బంది లేకుండా చూడాలని తెలిపారు. జ్వరం, పొడిదగ్గుతో ఎవరైనా బాధపడుతుంటే 104, 1902 నెంబర్లకు ఫోన్‌ చేసి తెలపాలని సీఎం అదనపు ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్‌ తెలిపారు. దీనిపై గ్రామాలు, పట్టణాల్లోని వాలంటీర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. వ్యాయామం చేయడం సహా పౌష్టికాహారం తీసుకోవాలని హితవు పలికారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు.

రాష్ట్రంలో నిత్యావసరాల వస్తువుల కొనుగోలు సమయాన్ని ప్రభుత్వం కుదించింది. ఉదయం ఆరు గంటల నుంచి 11 లోపు మాత్రమే ఉపశమనం కల్పించింది. ఆ తర్వాత ఎవరూ బయట తిరగొద్దని మంత్రి ఆళ్ల నాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిత్యవసరాలు, కూరగాయలను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన మంత్రి... ధరలు తెలిపే బోర్డులను దుకాణాల వద్ద ఏర్పాటు చేయాలని యజమానులకు సూచించారు. ఈ విషయంలో ఎలాంటి సమస్యలు వచ్చినా 1902 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోనే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని... అందుకే మళ్లీ రీ సర్వే చేసి అనుమానం ఉన్నవారిని క్వారంటైన్‌కు తరలించాలని సీఎం ఆదేశించినట్టు మంత్రి వెల్లడించారు.

Advertisements