తిరువతి నగరంలో కరోనా బాధిత రోగి మృతదేహాన్ని జేసిబితో ఖననం చేసిన సంఘటన సోమవారం ఉదయం జరిగింది. కరోనా వైరస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన రోగి మృతదేహాన్ని మానవత్వంతో కాకుండా విలువలు మరచి పిపిఈ కిట్లు ధరించి జేసిబిని వినియోగించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఆదివారం జిల్లాలో కరోనా వైరస్ బాధిత రోగుల వివరాల జాబితాలో ఈ మరణ వార్తను అధికారులు తెలియజేయకపోవడం కూడా కొంత విస్మయం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ఇదే తరహాలో చోటుచేసుకున్న ఘటన మరచిపోకముందే తిరుపతిలోసిబ్బంది నిర్వాకం వెలుగు చూసింది. పలాసలో జరిగిన ఘటన పై దేశ వ్యాప్తంగా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తిరుపతి నగరానికి చెందిన ఆ వ్యక్తి (64)కళాకారుడు. కరోనా వైరస్ బారినపడటంతో కొద్దిరోజుల క్రిందట తిరుపతి రుయా ఆస్పత్రిలోని కొవిడ్ వార్డులో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారంరాత్రి మృతిచెందాడు.

కరోనా రోగి మృతదేహాన్ని అంబులెన్స్ లో సోమవారం ఉదయం తిరుపతి నగరపాలకసంస్థ కార్యాలయం నమీవంలో వున్న హరిశ్చంద్ర శ్మశానవాటిక వద్దకు తరలించారు. అప్ప టికే శ్మశానవాటికలో అధికారులు తవ్వించిన గోతిలో జెసిబి బకెట్లోకి ఎక్కించి మృతదేహాన్ని గోతిలో పడేసి అంత్యక్రియలు నిర్వహించారు. కొన్ని గంటల్లోనే ఈ సంఘటన సోషల్ మీడియా లో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే మృతుని బరువు కారణంగానే జెసిబితో ఖననం చేసామని కమిషనర్ సెహ్ప్పారు. కరోనా వైరస్ తో మృతి చెందిన రోగి మృతదేహాం బరువు 160 కిలోలు ఉండటంతోనే జెసిబితో ఖననం చేయాల్సి వచ్చిందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పిఎస్ గిరీషా వివరణ ఇచ్చారు. జేసిబితో కరోనా మృతదేహం ఖననం సంఘటన సోషల్‌మీడియాలో వైరల్ గా మారడంతో సోమవారం సాయంత్రం 6గంటలకు అత్యవసరంగా మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు. కరోనా వైరస్ తో మృతిచెందిన వృద్ధుని బరువు అత్యధికంగా వుండటంతోనే పారిశుధ్య సిబ్బంది జెసిబితో అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చిందని వెల్లడించారు. అంతేగాక మృతదేహం నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన చర్య లు తీసుకున్నట్లు కమిషనర్ తెలిపారు.

Advertisements