ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ రోజు జరపటం పై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై, విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ నేత తులసి రెడ్డి. ఆయన మాటల్లో "నవంబర్ 1 వ తేదీ, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర అవతరణ దినంగా ప్రకటిస్తూ, 27వ తేదీన జీవో విడుదల చేసింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దినోత్సవాలు జరుగుతున్నాయి. ఇది సమంజసం కాదు. ఇది సహజం కాదు. ఇది సాంప్రదాయం కాదు. ఎందుకంటే, మన రాష్ట్రానికి సంబంధించి మూడు రోజులు ఉన్నాయి. ఒకటి పుట్టిన రోజు, రెండు పెళ్లి రోజు, మూడు విడాకుల రోజు. 1953 అక్టోబర్ 1న అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ఫలితంగా, సమైక్య మద్రాసు రాష్ట్రం నుంచి, రాయలసీమ ప్రాంతము, కోస్తా ఆంధ్రా ప్రాంతం విడిపోయి, ఆంధ్ర రాష్ట్రంగా, రాష్ట్రం అవతరించింది. ఇది అవతరణ దినం, ఇది పుట్టిన రోజు. 1953 అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ పుట్టిన రోజు. దాని తరువాత, 1956 నవంబర్ ఒకటిన, ఆంధ్ర రాష్ట్రము, ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతము కలిసి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. ఒక విధంగా చెప్పాలి అంటే, ఇది మన రాష్ట్రానికి పెళ్లి రోజు. 1956 నవంబర్ ఒకటి అనేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెళ్లి రోజు. దాని తరువాత, 2014 జూన్ 2న, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయి, నవ్యాంధ్రప్రదేశ్ గా, తెలంగాణా రాష్ట్రాలుగా ఏర్పాటు అయ్యాయి. "

tulasireddy 01112020 1

"ఒక విధంగా చెప్పాలి అంటే, 2014 జూన్ 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడాకుల రోజు. పుట్టిన రోజున , పుట్టిన రోజు జరపుకోవటం అనేది, అది సాంప్రదాయం, సహజం, అది సమంజసం. పెళ్లి రోజును, పుట్టిన రోజుగా జరుపుకోవటం సమంజసం కాదు. సాంప్రదాయం కాదు. అది కూడా పెళ్లి పెటాకులు అయిన తరువాత, విడాకులు అయిన తరువాత, పెళ్లి రోజును, పుట్టిన రోజుగా ఉత్సవాలు చేసుకోవటం అనేది చాలా విడ్డూరం. కాబట్టి, ఈ సారికి అయిపొయింది కానీ, కనీసం వచ్చే ఏడాది నుంచి అయినా, రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి, నవంబర్ ఒకటిన కాకుండా, అక్టోబర్ ఒకటిన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరిపితే, అది సమంజసంగా ఉంటుంది. అప్పుడే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మకు శాంతి లభిస్తుంది" అని తులసి రెడ్డి అన్నారు. అయితే గతంలో చంద్రాబాబు హయంలో, జూన్ 2న మనల్ని అన్యాయం చేసిన రోజు కాబట్టి, ఆ రోజుని నవ నిర్మాణ దీక్ష పేరుతో, ఆ ఏడాది కసిగా ఎలా ఎదగాలి అని చెప్పేవారు. కానీ ఇప్పుడు వచ్చిన జగన్ ప్రభుత్వం అవన్నీ ఎత్తేసి, నవంబర్ 1 న తెలంగాణాతో కలిసిన రోజుని, అవతరణ దినోత్సవంగా జరుపుతుంది.

Advertisements