ఐటీ పరిశ్రమలకు అమరావతి కేంద్ర బిందువుగా మారుతోంది. రాజధాని అమరావతిలోని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో యువతకు ఉద్యోగావకాశాలు అందుబాటులోకి తేవాలని చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. రాజధానిలో నాన్‌ రెసిడెంట్‌ తెలుగు(ఎన్‌ఆర్టీ) ఈ కృషిలో భాగస్వామ్యం అయింది. ఐకానిక్‌ టవర్‌ నిర్మాణానికి ఎన్‌ఆర్టీ శ్రీకారం చుట్టబోతోంది. ఏపీ సీఆర్‌డీఏ ఐదు ఎకరాల భూమిని కేటాయించింది. మంగళగిరి సమీపంలో ప్రభుత్వం నేరుగా కంప్యూటర్‌ చీఫ్‌ డిజైనింగ్‌ సంస్థతో పాటు సెమీకండెక్టర్‌ సంస్థలను నెలకొల్పుతోంది. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌కి ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషి ఫలించేందుకు సదుపాయాలు చేరువ అవుతున్నాయి.

amaravati it 01072018 2

రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నాలుగేళ్లలోనే ఐటీ రంగం అభివృద్ధి చెందిందనే చెప్పాలి. ఇప్పటికే శిక్షణ పొందే యువతీయువకులు, ఉద్యోగాలు పొందిన వారి సంఖ్య 5వేలకు పైమాటే. మంగళగిరి వద్ద జాతీయ రహదారి పక్కన 18 ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసి ఎన్‌ఆర్టీ టెక్‌పార్కును ఏర్పాటు చేశారు. ఇక్కడ కంప్యూటర్‌ బేసిక్స్‌ నుంచి ఐటీకి సంబంధించిన పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ సంస్థలే 10 వరకు వెలిశాయి. విజయవాడతో కలిపి సుమారు 47 ఐటీ సంస్థలు పనిచేస్తున్నాయి.

amaravati it 01072018 3

33 అంతుస్తుల్లో ఐకానిక్‌ టవర్‌ : రాజధాని అమరావతిలో ఎన్‌ఆర్టీ కార్యకలాపాలను విస్తృతం చేసి రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి సంకల్పం నెరవేర్చటానికి వీలుగా ఎన్‌ఆర్టీలో లక్షకు పైగా సభ్యులు చేయి కలుపుతున్నారు. రాయపూడి-లింగాయపాలెం మధ్య సుమారు ఒక లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో 33 అంతస్తుల్లో ఐకానిక్‌ టవర్‌ నిర్మిస్తున్నారు. ఇందుకు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. టవర్‌ నిర్మాణానికి ఈనెల 22వ తేదీ ఉదయం 11గంటలకు శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరో రెండు ప్రతిష్ఠాత్మక సంస్థలు : మంగళగిరి ఆటోనగర్‌ ప్రాంతాన్ని ఐటీ పార్కుగా మార్చేశారు. పెద్ద సంస్థలు వెలుస్తున్నాయి. ఇప్పటికే పైడేటా వంటి ప్రముఖ సంస్థలతో పాటు, పైకేర్‌ సంస్థ కార్యకలాపాలను సాగిస్తోంది. సుమారు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన కంప్యూటర్‌ చీఫ్‌ డిజైనింగ్‌ సంస్థతో పాటు సెమీకండెక్టర్‌ తయారీ సంస్థలను ప్రారంభించారు. మంగళగిరి రత్నాల చెరువు వద్ద ఖాళీగా ఉన్న 30ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఐటీ సంస్థల కోసం కేటాయించింది. జిల్లా కలెక్టరు ఇప్పటికే స్థలాన్ని రిజర్వు చేశారు.

Advertisements