ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్లో నిరంతరం శ్రమిస్తున్న పోలీసు సేవలను, అందరూ మెచ్చుకుంటున్నారు. మొదట్లో, ఎక్కువుగా కొడుతున్నారు అని విమర్శలు వచ్చినా, తరువాత తరువాత ప్రజలు కూడా సహకరిస్తూ వచ్చారు. అయితే, కొంత మంది పోలీసులకు సలాం కొట్టకుండా ఉండలేం. విజయవాడ పరిధిలో పని చేస్తున్న శాంతారాం అనే ఎస్సై తల్లి మూడు రోజుల క్రితం విజయనగరంలో అనారోగ్యంతో మృతి చెందారు. లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న శాంతారాం అంత్యక్రియలకు వెళ్లలేకపోయారు. సెలవు దొరికినా విజయనగరంకు వెళ్లాలంటే మూడు జిల్లాలు దాటుకుని వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో తన సోదరుడికే అంత్యక్రియల బాధ్యతను అప్పగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడికి వెళ్లడం కష్టమైన నేపథ్యంలో విధుల్లోనే నిమగ్నమయ్యారు. ఈ ఘటన పోలీసుల విధుల నిబద్ధతకు నిదర్శనంగా మారింది. లాక్​డౌన్​ సమయంలో ప్రజలంతా రెండు వారాల పాటు బయటకు రావద్దని ఈ సందర్బంగా పోలీసులు సూచిస్తున్నారు.

ఇక మరో పక్క, బుధవారం అరకులోయలో లాక్ డౌన్ అమలును పర్యవేక్షించడానికి విచ్చేసిన ఆరుకు శాసనసభ్యులు చెట్టి ఫాల్గుణ అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆరకు లోయ ఎస్సై మోహన్ రావు దగ్గరకు వెళ్ళి, ఆయన పాదాలకు నమస్కారం చేశారు. విపత్కర సమయంలో పోలీసులు చేస్తున్న కృషి మరువలేనిదని పేర్కొంటూ మోహన్ రావు పాదాలుతాకి, శిరస్సు వంచి పాదాభి వందనం చేసారు. దీంతో మోహన్ రావు, పోలీసు సిబ్బంది ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ కు సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ మహమ్మారి కరోనా వైరస్ ను ఆపేందుకుగాను పోలీసులు చేస్తున్న కృషి పాదాభివందనం తెలిపినట్లు ఆయన చెప్పారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రాణాలను ఫలంగా పెట్టి కృషి చేయుచున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక పాదాభివందనాలు అని అన్నారు.

ముఖ్యంగా పోలీ సులు, వైద్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, మీడియా రేయింబవళ్లు పని చేస్తున్నట్లు తెలియజేశారు. ఇటువంటి విపత్కర సమయంలో ప్రభుత్వానికి ప్రజలు కూడా తమ మద్దతును ఇవ్వా లని కోరారు. ప్రజలు తమ ఇళ్లను వదిలిబయటకు రావద్దని, మాస్క్ లు ధరించాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర సమయాల్లో బయటకు వస్తున్న ప్రజలు తప్పని సరిగా దూరం పాటించాలన్నారు. అయితే ఇది ఇలా ఉంటే, ప్రజలు కూడా, సిబ్బంది మొత్తానికి సహకారం అందిస్తున్నారు. లాక్ డౌన్ జరిగిన మొదటి రోజు, బయటకు వచ్చి అందరినీ అభినందిస్తూ, చప్పట్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే, కొన్ని చోట్ల మాత్రం, పరిస్థితి అర్ధం చేసుకోకుండా, పోలీసు వారికి, వైద్యులకి సహకరించని వారు కూడా ఉన్నారు.

Advertisements