రాష్ట్రంలో గత మూడు రోజులుగా కలకలం సృష్టించిన ఆ లేఖను రాష్ట్ర ఎన్నికలకమిషన్‌ ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమారే రాశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో లేఖ కలకలానికి తెరపడినప్పటికీ ఏపీ రాజకీయాలు మాత్రం ఒక్కసారిగా మలుపుతిరిగినట్లయ్యాయి. ఆ లేఖను స్వయం గా ఈసీనే రాశారని కేంద్ర హోంశాఖ అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో అధికార వైసీపీ ఇప్పుడేం చేయబో తోంది..? ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ అసెంబ్లీలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అధికారపక్షం కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. మొదటినుండి ఈసీకి అనుకూలంగా అధికార పార్టీ పై ఎదురుదాడికి దిగుతున్న ప్రధాన ప్రతిపక్షమైన తెదేపా వ్యూహమేంటి?..అసలు లేఖ తరువాత ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి ఎలా ఉండబోతోంది అనే అంశాలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ నేపథ్యంలో ఆరు వారాలపాటు వాయిదా వేస్తూ ఈసీ ఈనెల 15వ తేదీ సంచలన నిర్ణయం తీసు కుంది. అయితే, అదే రోజు సాయంత్రం ఈసీ నిర్ణయంపై సీఎం జగన్ ఈసీ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కులం ఆపాదించటం, మంత్రులు, స్పీకర్ ఆయన్ను తిట్టటం వంటివి నడుస్తూ ఉండగానే, ఈసీ పేరుతో బుధవారం రాత్రి కేంద్ర హోం శాఖకు 5 పేజీల లేఖ చేరింది. అయితే, మొదట్లో ఆ లేఖ ఎవరు రాశారో స్పష్టంగా అర్థం కానప్పటికీ దేశవ్యాప్తంగా ఆ లేఖ మాత్రం రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించింది.

ఆ లేఖపై ఎట్టకేలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఒక ప్రకటన చేయడంతో లేఖ వివాదానికి తెరపడినట్లయింది. చేద్దాం కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది ఈసీనే అని నిర్ధారణ కావడంతో అధికార వైసీపీ కొత్త వ్యూహానికి పదునుపెడుతోంది. నిన్నటి వరకూ ఆ లేఖ తెదేపా కార్యాలయంలో తయారుచేసి ఈసీకి పంపితే ఆయనకేంద్ర హోంశాఖకు పంపారని, దీనిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయట పెట్టాలని కోరుతూ వైసీపీ ముఖ్య నేతలు డీజీపీ సవాంగ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. అయితే, వారు ఫిర్యాదుచేసి 48 గంటలు తిరగకమునుపే ఆ లేఖపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్పష్టమైన ప్రకటన చేయడంతో ఇప్పుడేం చేయాలనే అంశంపై అధికారపార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ప్రత్యేకించి ఈసీ కార్యకలాపాలు కూడా హైదరాబాద్ నుండే నిర్వహించాలని ఆయన ప్రకటించడం రాష్ట్రానికి వచ్చే సందర్భంలో బధ్రతను కూడా పెంచుతా మని, ఇదే విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాహ్నితో ఫోన్లో మాట్లాడి రక్షణ ఇవ్వాలని స్పష్టం చేశారు.

అవసరమైతే ఈసీ రక్షణ విషయంలో రాష్ట్రానికి లిఖితపూర్వ కమైన ఆదేశాలు కూడా ఇస్తామని చెప్పడాన్ని బట్టి చూస్తుంటే రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్రం మరింత మద్దతుగా నిలుస్తుందన్నది స్పష్టంగా అధికార పక్షానికి అర్ధమైంది. ఈ నేపథ్యంలో తదుపరి వ్యూహానికి వైసీపీ పదును పెడుతోంది. అందులో భాగంగానే ఈ నెల చివరలో జరగనున్న ఓటన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి తొలగించి ఆ తీర్మాణాన్ని కేంద్రానికి పంపాలనే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి జగన్ చేసే ప్రతి అప్రజాస్వామిక అంశంలోనూ ప్రధాన ప్రతిపక్షమైన తెదేపాపై ఎదురుదాడి చేస్తూనే ఉంది. ప్రజా వేదిక కూల్చటం, మూడు ముక్కల రాజధాని, తన మాట వినని శాసనమండలి రద్దు చెయ్యటం వంటి వాటి పై పోరాడుతూనే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల కు నోటిఫికేషన్ విడుదల అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న వివిధ సంఘటనల నేపథ్యంలో ఈసీని వేదిక గా చేసుకుని తెదేపా అధికారపక్షంపై దూకుడు పెంచింది. అందుకు తగ్గట్టుగానే రాజకీయ వాతావరణం వారికి అనుకూలంగా మారడం, ఈసీ కేంద్రానికి లేఖ రాయ డం, ఆ లేఖకు మద్దతుగా కేంద్రం ప్రతిస్పందించడం తెదేపా తనకు అనుకూలంగా మల్చుకుని తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమౌతోంది.

Advertisements