చీరాల రాజకీయాలు మరోసారి కాకరేపుతున్నాయి. వైఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి ఇందుకు ఆజ్యం పోసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎన్నికల ముందు చేరిన ఆమంచి కృష్ణమోహన్, ఎన్నికల తర్వాత చేరిన కరణం వర్గీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై, చీరాల నియోజకవర్గంపై హక్కులు తమవంటే తమవంటూ.. పరస్పర ఆరోపణలు సంధించు కుంటున్నారు. రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు పరాకాష్టకు చేరింది. నియోజకవర్గంలో ఎవరి పెత్తనం సాగాలనే విషయంలోనే ఇక్కడ గొడవంతా.! చీరాలలో గత రాజకీయాలను పరిశీస్తే.. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోతుల సునీత స్వతంత్ర అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్తో పోటీ చేశారు. పోతుల సునీత ఓడిపోగా తెలుగుదేశం పార్టీ ఆధికారంలోకి వచ్చింది. చీరాల ఇన్చార్జిగా సునీత కొంతకాలం అధికారం చలాయించారు. ఎమ్మెల్యేగా గెలిచినా అధికారం లేకపోవడంతో ఆమంచి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి చీరాలలో అధికార పగ్గాలు అందిపుచ్చుకున్నారు. ఆ సమయంలో సునీత, ఆమంచి ఒకే పార్టీలో ఉన్నందును ఆధిపత్య పోరు కొనసాగింది. 2019 ఎన్నికల వరకూ పోతుల సునీత చీరాల రాజకీయాల జోలికి రాలేదు.. చంద్రబాబు ఆమంచికి మంచి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2019 ఎన్నికల్లో ఆమంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

తప్పనిసరి పరిస్థితుల్లో కరణం బలరాం టిడిపి తరపున పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్రం అంతటా అత్యధిక సీట్లతో వైసిపి అధికారంలోకి వచ్చింది. కానీ 2014 ఎన్నికల్లో సొంతంగానే గెలిచిన ఆమంచి 2019 ఎన్నికల్లో పార్టీ గుర్తు ఉన్నప్పటికీ 17 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆమంచి ఓడిపోయినా పార్టీ గెలిచింది. కనుక చీరాల నియోజకవర్గ ఇన్ ఛార్జి హోదాలో ఆమంచి చీరాల నియోజకవర్గంలో అధికార పగ్గాలు అందుకున్నారు. ఆయన పెత్తనం కొనసాగింది. బలరాంకు వైసిపి నుంచి ఆహ్వానం రావడంతో ఆ పార్టీకి మద్దతు తెలిపారు. ఆయన తనయుడు కరణం వెంకటేష్ వైసిపిలో చేరారు. రాజకీయాల్లో ఉన్న ఆనవాయితీ ప్రకారం కరణం బలరాంకు చీరాలలో అధికారాల బదలాయింపు జరగాలి. కానీ పార్టీ ఇన్‌ఛార్జిగా తాను ఉన్నాను కనుక తన పెత్తనమే కొనసాగాలనేది ఆమంచి వాదన. దీంతో ఇద్దరి మధ్య చీరాల నియోజకవర్గంలో ఆధిపత్య పోరు ముదిరింది. చీరాల నియోజకవర్గంలో నెలకొన్న ఆధిపత్య పోరుకు స్వస్తి పలికే దిశగా పార్టీ అధిష్టానం ఒక పరిష్కార మార్గాన్ని సూచించినట్లు చెబుతున్నారు. చీరాల ప్రజాప్రతినిధిగా ఉన్న కరణం బలరాంను వేరొక నియోజకవర్గానికి పంపడం కుదరదు కనుక ఆమంచిని పర్చూరు బాధ్యతలు చేపట్టాలని కోరినట్లు తెలిసింది. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ప్రజల్లో ఒకింత వ్యతిరేకత వస్తుంది.

కనుక చీరాలలో ఉండి ఇబ్బందులు పడే కన్నా పర్చూరులో బలమైన నాయకత్వం అవసరం ఉన్న క్రమంలో ఆమంచిని అక్కడి భాధ్యతలు చేపట్టాలనేది అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. ఈ ఫార్ములా వల్ల ఇద్దరు నాయకుల మధ్య ఉన్న ఆధిపత్య పోరుకు స్వస్తి పలకడంతో పాటు ఆటు పర్చూరు, ఇటు చీరాలలో కూడా పార్టీకి మేలు జరుగుతుందనేది అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. చీరాలను వదిలి వెళ్లడం ఆమంచికి ససేమిరా ఇష్టం లేదని తెలుస్తోంది. 2014 నాటి తరహా ఫార్ములాను ఆచరణలో పెట్టేందుకు ఆమంచి అంగీకరించడం లేదని చెబుతున్నారు. వైసిపికి మద్దతు ఇచ్చే సమయంలో ఇచ్చిన హామీ మేరకు కరణం బల రాంకు చీరాల నియోజకవర్గంలో అధికారాల బదలాయింపులు ఒక్కొక్కటిగా జరు గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల వైఎస్.రాజశేఖరరెడ్డి వర్గంతి సందర్భంగా కరణం వెంకటేష్ చేసిన కొన్ని వాఖ్యలు చీరాల రాజకీయాల్లో కాక రేపాయి. స్వయంగా ఆమంచి పార్టీ అధిష్టానానికి ఈ విషయమై ఫిర్యాదు చేశారు. వైసిపిలోని ఆమంచి అనుయాయులు బృందంగా తాడేపల్లి వెళ్లి పార్టీ కేంద్ర కార్యాలయ వ్యవహారాల ఇన్చార్జి అప్పిరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. చీరాలలో రెండు గ్రూపుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు తరచుగా శాంతి-భద్రతల సమస్యగా మారుతోంది.

Advertisements