ప్రతిష్టాత్మక భాగస్వామ్య సదస్సు, CII సమ్మిట్ కు రెండోసారి ఆతిథ్యం ఇచ్చేందుకు, నవ్యాంధ్రప్రదేశ్‌ ఆర్థిక రాజధాని విశాఖపట్నం సిద్ధమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ), కేంద్ర ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సు కోసం తూర్పు తీరంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన విశాఖపట్నం రెడీ అవుతుంది. గత ఏడాది జనవరిలో సదస్సును నిర్వహించిన ఎపిఐఐసి గ్రౌండ్స్‌లోనే ఈసారి కూడా 27, 28 తేదీల్లో సదస్సును నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా, 22 సార్లు ఈ భాగస్వామ్య సదస్సు జరిగితే, అందులో 5 సార్లు చంద్రబాబు నాయకత్వంలో జరిగాయి.

రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకి దేశ, విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రత్దినిధులు, ఆర్ధిక నిపుణులు పాల్గుంటారు. 50 దేశాల ప్రతినిధులతో సహా దేశ విదేశాలకు చెందిన 2000 మంది ఇన్వెస్టర్లు, పారిశ్రామిక, వాణిజ్యరంగాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. 15 మంది కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి చెందిన 30 మంది మంత్రులు సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సదస్సులో రాజధాని అమరావతి నగర నిర్మాణానికి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు .. ప్రాధాన్య రంగాలైన ఆటోమొబైల్‌ అండ్‌ ఆటోమొబైల్‌ కాంపోనెంట్స్‌, టెక్స్‌టైల్స్‌-అపెరల్‌ పార్కులు, బయోటెక్నాలజీ, ఏరోస్పే్‌స-డిఫెన్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, పెట్రోలియం- పెట్రోకెమికల్స్‌ లో భారీ స్థాయిలో పెట్టుబడులు, ఉపాధి కల్పనను పరిశ్రమల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార, పారిశ్రామిక అవకాశాలను షోకస్‌ చేయడం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. సాధారణంగా భాగస్వామ్య సదస్సుల్లో లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలు రావడం ఆచరణలోకి వచ్చేసరికి అందులో 20-30 శాతం కూడా కార్యరూపం దాల్చకపోవడం రివాజుగా వస్తోంది. గతేడాది జనవరిలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు ద్వారా, 328 కంపెనీలు 4.62 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో, 8.72 లక్షల మందికి ఉపాధి అవకాశాల కోసం MoU కుదుర్చుకున్నారు. అందులో, 93 కంపెనీలు, ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించాయి, మరో 43 కంపెనీలకు భూములు కేటాయింపు అయ్యింది, పని మొదలు పెట్టల్సి ఉంది. ఇలాంటి సదస్సుల్లో, MoU లు కుదుర్చుకున్న వాటిలో, 20-30 శాతం కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చెయ్యవు. అలాంటిది మనకు, పోయిన సారి 31 శాతం కార్యరూపం దాల్చాయి. మరో 10 శాతం క్షేత్ర స్థాయిలో మిషనారీ ఏర్పాటు, బిల్డింగ్ లు కట్టుకునే పనిలో ఉన్నారు. ఇంకా ఫాలో అప్స్ చేస్తున్నారు కాబట్టి, ఇది 50% దాటే అవకాశాలు ఉన్నాయి.

ఈ సారి పరిస్థితి ఇంకా ఆశాజనకంగా ఉన్నట్టు, అధికార వర్గాలు భావిస్తున్నాయి. క్రిందటి సంవత్సరంతో పోలిస్తే, మౌలిక సదుపాయాలు చాలా మెరుగుపడ్డాయి... కరెంటు, నీళ్ళు, భూమికి కొరత లేకపోవటం, మంచి రవాణా కనెక్టివిటీ, ముడి సరకు లభ్యత అన్నీ కలిసి వచ్చే అంశాలే. ఈ ఏడాది, 8 లక్షల కోట్ల పెట్టుబడులు తేవాలి అనేది లక్ష్యం.

Advertisements