ఆంధ్రప్రదేశ్‌కు, అమరావతికి ఆర్ధిక వనరులు, పెట్టుబడులు సమకూర్చడంలో ‘మెకెన్సీ గ్లోబల్’ముఖ్యభూమిక పోషించాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అభిలషించారు. ఇందుకోసం సంస్థలోని ప్రతిభావంతులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, తమ రాష్ట్రానికి పెట్టుబడులు సమకూర్చే బాధ్యతను ఆ బృందానికి అప్పగించాలని ముఖ్యమంత్రి కోరారు.

దావోస్ ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో బుధవారం తనతో భేటీ అయిన ‘మెకెన్సీ గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్’ సంచాలకుడు జోనాథన్ ఓజల్ (Jonathan Woetzel)తో మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో పునాదులనుంచి నిర్మాణం అనివార్యమైందని, తమ ఈ కృషిలో ’మెకెన్సీ గ్లోబల్’ క్రియాశీలకపాత్ర పోషించాలని కోరారు.

జోనాథన్ వోజల్ (Jonathan Woetzel) మాట్లాడుతూ అంతర్జాతీయ వాణిజ్యంలో భవిష్యత్తు అంతా భారత్, చైనా దేశాలదేనన్నారు. ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో 25% ఈ రెండు దేశాల నుంచే వస్తుందని, సాంకేతికత కూడా ఈ ఉభయదేశాలదే ఉంటుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు చైనా పెట్టుబడుల రాకను సులభతరం చేసే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు.

రానున్న మూడు మాసాలలో చైనా నుంచి 20 ప్రధాన వాణిజ్య, పారిశ్రామిక సంస్థలను రాష్ట్రానికి తేవటంలో, పెట్టుబడి దారులు రావటంలో తాము తోడ్పడతామని జోనాథన్ వోజల్ (Jonathan Woetzel) వివరించారు.

ఏపీ సీఎంతో జేపీ మోర్గాన్ ఛేస్ వాణిజ్య వ్యూహ విభాగ అధిపతి భేటీ
ఆర్ధిక, సాంకేతికాంశాలలో సహకరించాలని కోరిన చంద్రబాబు
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో జేపీ మోర్గాన్ ఛేస్ (Jp Morgan Chase) వాణిజ్య వ్యూహ విభాగ అధిపతి మాక్స్ న్యూకిర్షెన్ (Max Neukirchen) సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పుష్కల సహజవనరులు, అపరిమిత అవకాశాలపై ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు. ఆర్ధిక, సాంకేతికాంశాలలో తమ ప్రభుత్వానికి సహకరించాలని మాక్స్ న్యూకిర్షెన్ (Max Neukirchen) కు విజ్ఞప్తి చేశారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలలో ఐఓటి పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగిస్తున్నామో చెబుతూ ‘కోర్ డ్యాష్ బోర్డు’ ప్రత్యేకతను వివరించారు. జేపీ మోర్గాన్ ఛేజ్ అధిపతి ఆసక్తిగా విన్నారు. సంస్థకు ఉన్న అంతర్జాతీయ కార్యవ్యవస్థ ద్వారా అమరావతి అభివృద్ధికి పెట్టుబడులు వచ్చేలా చూడాలని కోరారు.

భారత్‌ దిశగా టీజిన్ (TEIJIN LTD) అడుగులు
ఆంధ్రప్రదేశ్ వైపు చూపులు
ఆప్టికల్ ఫైబర్ కేబుల్ సపోర్టింగ్ షీట్ల తయారీలో ప్రసిద్ధి చెందిన టీజిన్ (TEIJIN LTD) టీజిన్ లిమిటెడ్ సంస్థ అధ్యక్షుడు జున్ సుజుకీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. అనేకరంగాల్లో ప్రసిద్ధి చెందిన టీజిన్ ఆంధ్రప్రదేశ్‌ను తన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జున్ సుజుకీకి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సుదీర్ఘ సముద్రతీరం, ఇతర మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి వివరించారు. పారిశ్రామికాభివద్ధి కోసం సింగిల్ డెస్క్ పాలసీని అనుసరిస్తున్నామని, అన్ని అనుమతులను మూడు వారాల్లో ఇస్తామన్నారు. కార్బన్, అల్యూమినియం, ఫైబర్స్ లో టీజీన్‌ రంగాలలో టీజిన్ కు అనుభవం వుంది. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ సపోర్టింగ్ షీట్స్ తయారీలో కూడా ప్రసిద్ధి చెందింది. ఈ సంస్థ తయారుచేసే ఉత్పత్తులకు భారత్ అతిపెద్ద దిగుమతిదారుగా వుంది. ఫైబర్స్, హెల్త్ కేర్, ఫార్మాస్యూటికల్ ప్రధాన వ్యాపారంగా చేసుకున్న ఈ సంస్థ కొరియా, జపాన్ దేశాలలో విస్తరించి వుంది. భారత్ లో అడుగులు వేయటానికి టీజిన్ సన్నాహాలు చేసుకుంటోంది. ఈ క్రమంలో మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టీజిన్ (TEIJIN LTD) టీజిన్ లిమిటెడ్ సంస్థ అధ్యక్షుడు జున్ సుజుకీని కోరారు.
తిరుపతి నగరాభివృద్ధికి కుమియుమి రెడీ

20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తెస్తానన్న సంస్థ
తగిన ప్రతిపాదనలు, ప్రణాళికలతో రావాలన్న ముఖ్యమంత్రి
ప్రపంచమంతా ప్రణమిల్లే తిరుమల శ్రీవారి సన్నిధికి ఆధ్యాత్మిక ముఖద్వారం తిరుపతి నగరం. అంతటి ప్రాముఖ్యమున్న తిరుపతి నగరాన్ని అభివృద్థి చేయటానికి జపాన్ కు చెందిన ‘కుమియుమి అస్సెట్స్ కంపెనీ’ ముందుకు వచ్చింది. బుధవారం దావోస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కుమియుమి అస్సెట్స్ మేనేజిమెంట్ కంపెనీ ప్రెసిడెంట్ యసుయో యమజకి సమావేశమయ్యారు. ఇప్పటికే పుణ్యధామం వారణాసి నగరాభివృద్ధిలో భాగస్వామిగా ఉన్నామని, తిరుపతి నగరాభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని ఆయన ముఖ్యమంత్రికి వివరించారు.

తమకు ఫండ్, టెక్నాలజీ, ప్రాజెక్టుమేనేజిమెంట్ రంగాలలో ఆసక్తి వుందని ఆయన తెలిపారు. గృహ నిర్మాణం, ఉద్యోగాల కల్పన, వ్యవసాయ రంగాలలో జపనీస్ కంపెనీలతో కలిసి ఒక కన్సార్టియంగా ముందుకొచ్చి 15 నుంచి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడిని తీసుకురాగలమని కుమియుమి ప్రెసిడెంట్ ప్రతిపాదించగా, స్పష్టమైన ప్రణాళికతో రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిస్కో చైర్మన్ ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ లో డిజిటలైజేషన్ దిశగా తీసుకుంటున్న చర్యలపై ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు సదస్సుల్లో ప్రస్తావనలు, ప్రశంసలు వచ్చాయని సిస్కో చైర్మన్ జాన్ చాంబర్స్ తెలిపారు. బుధవారం దావోస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయినప్పుడు వరల్డ్ బ్యాంక్ సదస్సు విశేషాలను వివరించారు. వివిధ రంగాల్లో రాష్ట్రాభివృద్ధిని సిస్కో చైర్మన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.

ఇండియాలో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సిద్ధం
ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనరల్ అట్లాంటిక్ ఎండీ
భారత్‌లో తాము 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు జనరల్ అట్లాంటిక్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ నాయక్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీలో ఈ అంశాన్ని వివరిస్తూ జనరల్ అట్లాంటిక్ సంస్థ 30 బిలియన్ డాలర్ల సామర్ధ్యం ఉందని, ఐటీ, హెల్త్ కేర్ వంటి ప్రధాన రంగాలలో పెట్టుబడులు పెడుతుందన్నారు. ఫస్టు జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్లు, స్టార్టప్స్‌కు పెట్టుబడులు సమకూర్చుతామని తెలిపారు.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి అల్పాహార విందు
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కలసి ముఖ్యమంత్రి అల్పాహార విందు తీసుకున్నారు. భోజనప్రియుడైన నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్ ఘుమఘుమలను, ప్రత్యేక వంటకాల రుచులను బుధవారం నాడే అడిగి తెలుసుకున్నారు. దావోస్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి బృందంలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆంధ్ర్రపదేశ్ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, ఇంధన వనరులు, ఐ అండ్ ఐ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈవో జాస్తి కృష్ణకిషోర్ వున్నారు.

Advertisements