ggh free operation 19012017

రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంతో వ్యయంతో కూడిన.. క్లిష్టమైన చిన్నారుల గుండె శస్త్రచికిత్సలను ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రిలో ఉచితంగా చేసేందుకు నిర్ణయించారు. అర్హులైన చిన్నారులకు ఈ శస్త్రచికిత్సలను ఉచితంగా నిర్వహించడానికి ప్రభుత్వం పచ్చజెండా వూపింది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే లభించే ఖరీదైన పిల్లల గుండె ఆపరేషన్లు గుంటూరు జీజీహెచ్లో బుధవారం ప్రారంభమయ్యాయి.

పిల్లల గుండె ఆపరేషన్లు నిర్వహించిన మొట్టమొదటి ప్రభుత్వాస్పత్రిగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి చరిత్ర సృష్టించింది. సహృదయ హెల్త్, మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్వాహకుడు, గుండెమార్పిడి ఆపరేషన్ వైద్య నిపుణుడు ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే ఆధ్వర్యంలో సుమారు రెండు లక్షల ఖరీదుచేసే ఆపరేషన్ ను ఓ బాబుకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేశారు.

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్ల పల్లికి చెందిన మొగిలి గోపి, ఏసుమణి దంపతులకు ఇద్దరు సంతానం. కూలి చేసుకుంటూ జీవిస్తున్న గోపీ పెద్దకుమారుడు నాలుగేళ్ల బెన్నీ సాల్మన్ కు ఏడాది క్రితం గుండెజబ్బు వచ్చింది. స్థానికంగా పలు ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా తగ్గలేదు. గుండెలో రంద్రాలు ఉన్నాయని, ఆపరేష న్ చేయాలని వైద్యులు చెప్పడంతో జీజీహెచ్ లో ఉచిత గుండె ఆపరేషన్ గురించి మీడియా ద్వారా తెలుసుకుని పదిరోజుల క్రితం ఇక్కడకు వచ్చారు. వైద్య పరీక్షలు చేయగా, గుండెలో ఉండే నాలుగు గదుల్లో రెండింటికి రంద్రాలు ఉన్న విషయం బయటపడింది. పుట్టుకతో వచ్చే గుండె జబ్బుగా వైద్యులు నిర్ధారించి బుధవారం ఉదయం 9 గంటలకు ఆపరేషన్ చేయడం ప్రారంభించారు. సుమారు రెండున్నర గంటల వ్యవధి అనంతరం క్లోజర్ డివైజ్ ఆపరేషన్ చేసి రంధ్రాలను పూడ్చివేశారు.

తొలుత జనవరి 2 నుంచి గుండె ఆపరేషన్లు చేయాలని భావించి ఇద్దరు చిన్నారులకు పరీక్షలు చేశారు. పిల్లల ఆపరేషన్లకు కొందరు వైద్యులు సహకరించకపోవడం, కొన్ని అవాంతరాలు ఎదురవడంతో వాయిదా పడిన ఆపరేషన్లు ఎట్టకేలకు బుధవారం విజయవంతంగా ప్రారంభమయ్యాయి.

ఏడాదికి 15 నుంచి 18 చేయాలనేది లక్ష్యం - గోపాలకృష్ణ గోఖలే
ఏడాదికి 15 నుంచి 18 మంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు చేయాలనేది మా లక్ష్యం. ఇవి చాలా క్లిష్టమైనవి. పుట్టుకతోనే చాలా మందికి గుండె నాళాలు మూసుకుపోవడం, రంధ్రాలు పడడం వంటివి జరుగుతాయి. వాటిని మొదటి దశలోనే గుర్తించి శస్త్రచికిత్సలు చేస్తే భవిష్యత్తులో వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దాతలు కూడా ముందుకొస్తే బాగుంటుంది. రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తన తండ్రికి సంబంధించిన ట్రస్టు ద్వారా కొంత ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చారు.

ఉచిత ఆపరేషన్ కోసం ఏమి చెయ్యాలి

  • ముందుగా గుండె జబ్బు వచ్చిన పిల్లలని గుంటూరు జీజీహెచ్‌ కు తీసుకురావాలి
  • అక్కడ డాక్టర్లు అవసరమైన వైద్య పరీక్షలు చేసి, ఆపరేషన్ అవసరమో లేదో నిర్ణయిస్తారు
  • ఆపరేషన్ అవసరం అయితే, ఎప్పుడు ఆపరేషన్ చెయ్యాలో డాక్టర్లు చెప్తారు
Advertisements