రాష్ట్రాన్ని పారిశ్రామికరంగం వౖపు పరుగులు తీయించడంతోపాటు రానున్న రోజుల్లో ప్రపంచంలోనే పరిశ్రమల ఏర్పాట్లో టాప్‌ 10లో ఆంధ్రప్రదేశ్‌ను ఉంచాలన్న లక్ష్యంతో పారిశ్రామికవేత్తలను స్వాగతిస్తూ వారికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కొడవలూరు మండలం రాచర్లపాడు వద్ద ఉన్న ఇఫ్కో కిసాన్ సెజ్‌లో ఏర్పాటు చేసిన గమేశా గాలిమరల రెక్కల తయారీ పరిశ్రమను ప్రారంభించారు. ఈ పరిశ్రమ వల్ల సుమారు వెయ్యి మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే పెద్ద ఎత్తున అర్భన్ పాపులేషన్ ఉండాలని అన్నారు. ఇంకొపక్క పరిశ్రమలు ఉండాలని, అప్పుడే సర్వీస్ సెక్టర్ అభివృద్ధి అవుతుందని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో ఎంవోయూ చేసుకున్న గమేశా... ఏడాది తిరగక మునుపే రూ.500 కోట్లతో తొలి దశ పనులు పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభించడం హర్షణీయమన్నారు. పరిశ్రమలు, విద్యాసంస్థలు, నగరాలు ఉన్నప్పుడే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని తెలిపారు.

రాష్ట్రాభివృద్ది పరిశ్రమల ఏర్పాటుతోనే సాధ్యమవుతుందని ఆ దిశగానే వారిని ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమలు నెలకొల్పేందుకు నిరంతరం కృషిచేస్తున్నామన్నారు. అందులో భాగంగానే విద్యుత్‌ కొరతను అధిగమించేందుకు థర్మల్‌ కేంద్రాలను ప్రోత్సహించామని ఫలితంగానే రాష్ట్రానికి 24 గంటలు విద్యుత్‌ను సరఫరా చేయగలుగుతున్నామన్నారు. గతంతో పోలిస్తే విద్యుత్‌ లోటును కూడా అధిగమించామన్నారు. అలాగే విద్యుత్‌ ఆదాను కూడా చేయాలన్న పట్టుదలతో రాష్ట్రంలోని అన్నీ మున్సిపాలిటీల్లో ఎల్‌ఈడీ బల్బులు అందించామన్నారు.

అధికారంలో వచ్చిన వెంటనే రాష్ట్రంలో విద్యుత్‌ కొరత లేకుండా చేశామని చంద్రబాబు తెలిపారు. ఉదయ్‌ పథకం కింద రూ. 8,256 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ నష్టాలను తగ్గించగలిగామన్నారు. సౌర విద్యుత్‌ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని, రాబోయే రోజుల్లో 18వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళుతున్నామని సీఎం తెలిపారు. ఈ ఏడాది పవన విద్యుత్‌ 2094 మెగావాట్లని, 974 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుందని, 9700 సోలార్‌ పంపుసెట్లు ప్రవేశపెట్టామని చంద్రబాబు పేర్కొన్నారు. విద్యుత్‌ ఆదాకు వినూత్న ఆలోచనలు చేస్తున్నట్లు చెప్పారు.

ఆ కార్యక్రమంలో భాగంగానే వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో నెల్లూరు జిల్లాలో ఏర్పాటైన గమేస కంపెనీకి ప్రోత్సాహాన్ని ఇచ్చామని దీంతో ఆ కంపెనీ యాజమాన్యం ఆరు నెలల్లోనే రూ. 500 కోట్లతో తొలిదశ పనులను ప్రారంభించిందని ఆయన ఈ సందర్భంగా గమేస చైర్మెన్‌ రమేష్‌ కైమల్‌ను ప్రసంశించారు. అదేవిధంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 175 పరిశ్రమలను నెలకొల్పి అన్నీ ప్రాంతాలను పారిశ్రామిక ప్రాంతాలుగా అభివృద్ది చేయాలని ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తున్న రైతులకు తగిన ప్రాధాన్యతను ఖచ్చితంగా ఇస్తామని అలాగే స్థానికులకే పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ రాష్ట్రాన్ని అన్నీరంగాల్లో అభివృద్ది చేయాలని ముందుకు సాగుతున్నామన్నారు.

Advertisements