మీరు మొదటిసారి ఇల్లు కొనబోతున్నారా..? అయితే మీకోసం కేంద్రం ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. గృహ రుణం వడ్డీ చెల్లింపులపై గరిష్ఠంగా రూ.2.4 లక్షల సబ్సిడీ లభించనుంది. రూ.18 లక్షల వరకు వార్షికాదాయం కలిగి ఉండి, గరిష్ఠంగా 20 ఏళ్ళు కాలపరిమితితో రుణం తీసుకునేవారికి ఈ సబ్సిడీ సదుపాయం లభించనుంది. రూ.6 లక్షల వరకు వార్షికాదాయం కలిగి ఉండి, 15 ఏళ్ళు కాలపరిమితితో రుణం తీసుకునేవారికి ఇప్పటికే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. అయితే, రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు, 2022 నాటికి అందరికీ గృహాలు కల్పించాలన్న లక్ష్యాలకు ఊతమిచ్చేందుకు మరో రెండు సబ్సిడీ శ్లాబులను ప్రకటించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద గత ఏడాది డిసెంబర్ 31న ప్రధాని మోదీ రెండు సబ్సిడీ పథకాలను ప్రకటించారు. ఆ పథకాల పూర్తి వివరాలు మాత్రం తాజాగా విడుదల అయ్యాయి. ఆదాయ శ్లాబుల వారీగా వడ్డీ సబ్సిడీ వివరాలు..

1. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారు తమ వార్షికాదాయం ఆధారంగా సబ్సిడీకి అర్హత పొందుతారు. మొదటి శ్లాబు ప్రకారం.. రూ.6 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి, రుణ మొత్తంతో సంబంధం లేకుండా అసలు సొమ్ములో రూ.6 లక్షలపై 6.5 శాతం సబ్సిడీ లభిస్తుంది. అంటే, 20 ఏళ్ళు కాలపరిమితితో, 9 శాతం వార్షిక వడ్డీపై రూ.10 లక్షల రుణం తీసుకున్నారనుకుందాం. అందులో రూ.6 లక్షలకు 6.5 శాతం సబ్సిడీ పోను 2.5 శాతం వడ్డీనే చెల్లిస్తారు. మిగతా రూ.4 లక్షలకు మాత్రం 9 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
2. ఇక రెండో శ్లాబు విషయాకొస్తే.. రూ.12 లక్షల వరకు వార్షికాదాయం కలిగిన వారికి తీసుకునే గృహ రుణంలో రూ.9 లక్షల అసలుపై 4 శాతం వడ్డీ సబ్సిడీ లభిస్తుంది.
3. మూడో శ్లాబులో ఏడాదికి రూ.18 లక్షల వరకు ఆదాయం ఆర్జించేవారు తీసుకునే హోమ్‌లోన్‌లో రూ.12 లక్షల అసలు సొమ్ముపై 3 శాతం వడ్డీ సబ్సిడీ ఇస్తారు.

ఈ మూడు శ్లాబుల్లోనూ 9 శాతం వడ్డీతో 20 ఏండ్ల కాలపరిమితితో గృహరుణం తీసుకునేవారికి నెలవారీ కిస్తీ (ఈఎంఐ) చెల్లింపులపై దాదాపు రూ.2.4 లక్షల వరకు ఆదా అవుతుంది. అంటే చెల్లించాల్సిన ఈఎంఐ రూ.2,200 వరకు తగ్గుతుంది. గృహ రుణంపై లభించే పన్ను రాయితీలకు, పీఎంఏవై ద్వారా లభించే వడ్డీ సబ్సిడీ అదనం. అంటే 30 శాతం ఆదాయం పన్ను శ్లాబులో ఉండేవారికి ఏటా రూ.61,800 వరకు ఆదా అవుతుంది.

వడ్డీ సబ్సిడీ పథకాల అమలుకు నేషనల్ హౌజింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ), హడ్కో.. నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తాయి. ఈ పథకం కింద అల్పాదాయ విభాగంలో 18వేల మందికి సబ్సిడీ కల్పించారు. ఆదాయ పరిమితిని భారీగా పెంచిన నేపథ్యంలో ఈ పథకం ద్వారా వడ్డీ సబ్సిడీ పొందేవారి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఎన్‌హెచ్‌బీ ఉన్నతాధికారి ఒకరు అన్నారు.

Advertisements