కనీవిని ఎరుగని రీతిలో విశ్వంలో చరిత్ర సృష్టించటానికి, సరికొత్త సవాల్ స్వీకరించిన ఇస్రో... నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఒక్క రాకెట్ దూసుకెళ్తేనే నిబిడాశ్చర్యంతో చూస్తాం.. మరి అలాంటిది ఒక్కసారే 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపిస్తే.. ఇక ఆ ఆనందానికి ఆకాశమే హద్దవుతుందేమో..! ఈ మహత్తర ఘట్టం మన దేశంలో జరుగుతోందంటే అంతకంటే గర్వ కారణం మరొకటి ఉంటుందా..! ప్రపంచం మొత్తం మన వైపు చూసే ఈ అద్భుత ఘట్టం మరి కొన్ని రోజుల్లో జరగబోతోంది. ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపి ప్రపంచానికే సవాల్ విసరబోతోంది. ఇంతటి అద్భుతానికి వేదిక శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం షార్.

వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ ఇస్రో బాహుబలి అవతారమెత్తబోతోంది. మంగళయాన్, చంద్రయాన్1 వంటి ప్రతిష్టాత్మక ప్రయోగాలను విజయవంతం చేసిన ఆత్మ విశ్వాసంతో మరో భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 15వ తేదీన 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఘనత ఏ దేశానికి లేదు. అది మన దేశానికి మాత్రమే దక్కబోతున్న అరుదైన గౌరవం.

తొలి సారిగా ఆ ఖ్యాతి మనకే దక్క బోతోంది.
60వ రాకెట్ ప్రయోగం ద్వారా 104 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ వాహన నౌక ద్వారా నింగిలోకి చేర్చేందుకు రంగం సిద్ధమవుతోంది . సీ 37 వాహన నౌక ద్వారా 3స్వదేశీ, 101 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. 2016లో పీఎస్ఎల్వీ-34 రాకెట్ ద్వారా 20 ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టి షార్ విజయం సాధించింది. ఈ రికార్డును అధిగమించేందుకు ఏకంగా 83 ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు షార్ ప్రణాళిక రూపొందించింది.

 

Advertisements