మే2 వ తేదీన స్పీకర్ కోడెల జన్మదినం సందర్బంగా, ఒక మంచి కార్యక్రమానికి శ్రీకరం చుట్టారు. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా, వేడుకలు జరుపుకోకుండా, ఎదో ఒక సామాజిక సేవ చెయ్యటం కోడెల ఆనవాయితీ. క్రిందటి ఏడాది, పుట్టినరోజు సందర్భంగా 50 వేల ఇంకుడు గుంతలు తవ్వించి అప్పుడుకూడా ఒక చరిత్ర సృష్టించారు.

అయితే, ఈ సంవత్సరం కూడా, తన పుట్టినరోజు సందర్భంగా, మరణానంతరం అవయవదానం చేసే అంశంపై ప్రజల్లో చైతన్యం పెరిగే విధంగా, నరసరావుపేటలో మే 2న పదివేల మంది అవయవదాన పత్రాలు సమర్పించే సేవా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక్కడ జరిగే అవయవ దాన పత్రాల సమర్పణ కార్యక్రమం గిన్నీస్‌బుక్‌ రికార్డులో నమోదు కాబోతుంది. లండన్‌ నుంచి సంబంధిత ప్రతినిధులు హాజరవుతున్నారు.

కోడెల మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి మరణించిన అనంతరం వారి అవయవాలను దానం చేయటం వలన మరణించి కూడా వేరొకరిలో జీవించే అవకాశం లభిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు అవయవదాన పత్రాలను సమర్పించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. అవయవాలు దానం చేసే వారికి ప్రభుత్వం ప్రోత్సాహాలు అందించాలన్నారు. చనిపోయిన వ్యక్తి అవయవాలు దానం చేయటం వలన ఏడుగురు వ్యక్తుల్లో జీవించ వచ్చన్నారు.

గతంలో గంట వ్యవధిలో 6,900 అవయవదాన పత్రాల సమర్పణ గిన్నీస్‌ బుక్‌ రికార్డు కోయంబత్తూరులో నమోదైందని చెప్పారు. దీనిని అధిగమించి పదివేలకు పైగా పత్రాలు సమర్పించి గిన్నీస్‌ రికార్డు సాధించే ప్రయత్నం జరుగుతున్నదని వివరించారు.

Advertisements