ప్రాచీన చరిత్ర, సంపదలకు నిలువెత్తు సాక్ష్యం కొండవీడు కోట.... కొండవీడు కోట పర్యాటక కేంద్రంగానే కాదు, త్వరలో పరిశోధన కేంద్రంగా కూడా ఆవిర్భించనుంది. ఉద్యానవన కళాశాల, ఉద్యాన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనలు ఇప్పటికి కార్యరూపం దాల్చాయి. గుంటూరు జిల్లాలో మిర్చి పరిశోధనా కేంద్రం ఉంది. దీనికి సరైన స్థలం లేకపోవడంతో పరిశోధనలు నామమాత్రంగానే జరుగుతున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కొండవీడులో ఉద్యాన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సముచితంగా ఉంటుందని డాక్టర్‌ వైఎస్సార్‌ విశ్వవిద్యాలయ పాలకవర్గం నిర్ణయించింది.

కొండవీడులో ఏర్పాటు చేసే కళాశాల, పరిశోధనా కేంద్రాల వలన ఉద్యానపంటల ఎగుమతులు, మార్కెటింగ్‌ వ్యవస్థలను స్పైసెస్‌ పార్కుకు అనుసంధానం చేస్తారు. దీంతో జిల్లాలో ఉద్యాన పంటల్లో సాగు ఊపందుకోనుంది. కొండవీడులో ఏర్పాటు చేసే ఉద్యానవన కళాశాల, పరిశోధనా కేంద్రం రాజధాని అమరావతి ప్రాంతం కూడా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది.

కొండవీడు కోటకు పూర్వ వైభవం..
ప్రాచీన చరిత్ర, సంపదలకు నిలువెత్తు సాక్ష్యం కొండవీడు కోట. 1700 అడుగుల ఈ గిరిదుర్గం శత్రు దుర్భేద్యంగా ప్రసిద్ధి చెందింది. కొండవీడును శతృ దుర్బేధ్యమైన రాజ్యంగా తీర్చిదిద్దడమేగాకుండా, ప్రజాకాంక్ష పాలనను కొనసాగించిన ఘనత రెడ్డిరాజులది. వారు కొండవీడుకోటను రాజధానిగా చేసుకుని క్రీ.శ. 1325 నుంచి 1420 వరకు పరిపాలించారు. రాజ్యాన్ని ఉదయగిరి నుంచి కటక్‌ వరకు విస్తరింపజేసిన పరాక్రమ ధీరులు. రెడ్డిరాజుల పాలనాకాలం వ్యాపార, సంగీత, సాహిత్య, నాట్యాలకు సువర్ణయుగంగా భాసిల్లింది. ప్రపంచ పర్యాటక కేంద్రంగా కొండవీడు కోటను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. మరికొద్ది నెలల్లో కొండపైకి ఘాట్‌ రోడ్డు నిర్మాణం పూర్తి కానుంది. దీంతో ఈ ఏడాదే కొండవీడు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

Advertisements