ఎక్కు తొలిమెట్టు... కొండని కొట్టు ఢీకొట్టు... గట్టిగా పట్టే నువు పట్టు... గమ్యం చేరేట్టు... నువు పలుగే చేపట్టు... కొట్టు చెమటే చిందేట్టు... బండలు రెండుగ పగిలేట్టు... జీవితమంటే పోరాటం... పోరాటంతో ఉంది జయం...

ఈ పాట గుర్తుకువచ్చిందా ? రజనీకాంత్ నరసింహ సినిమాలోని పాట... ఇంచు మించు ఇలాగే, కొండల్లోని సున్నపురాయిని పగులగొట్టి.. కాల్చి సున్నం చేసి అమ్ముకునే చేతులతోనే ఇప్పుడు... అరటి పాదులను తీయడం కనిపిస్తుంది... సున్నపుబట్టీల్లో కమురేసుకుపోయిన వీరి బతుకుల్లోకి తొలిసారి పచ్చదనం తొంగిచూసింది... కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలోని బక్కన్నగారిపల్లె గ్రామంలో ఇప్పుడు ఈ దృశ్యమే కనిపిస్తుంది. కష్టం చేసే మనుషులకు ప్రభుత్వ సాయం తోడయ్యి, కొండని ఢీ కొట్టి, సాగుయోగ్యంగా మార్చుకున్నారు... బట్టీల్లోంచి అరటి తోటల్లోకి బక్కన్నగారిపల్లె పయనమైంది... ఇప్పుడు ఏకంగా ఇక్కడ నుంచి, ఢిల్లీ మార్కెట్‌కు అరటి గెలలు ఎగుమతి చేసుకునే స్థాయికి వచ్చారు.

పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి మండలం బక్కెనవారిపల్లి సుగాలీ కాలనీ.. ఇక్కడున్న 260 కుటుంబాలకు తరతరాలుగా సున్నపుబట్టీలే ప్రధాన వృత్తి. కొండల్లోని సున్నపురాయిని సేకరించడం.. బట్టీల్లో కాల్చడం..దాన్ని అమ్ముకుని జీవించడం. వారికి తెలిసిందిదే. మగవాళ్లంతా రాత్రింబవళ్లు బట్టీల్లో మాడిపోతుంటే, సున్నం బస్తాలతో ఆడవాళ్లు తిరిగి అమ్మేవారు.

పదిహేనేళ్ల క్రితం డీకేటీ భూములప్రతి కుటుంబానికీ ప్రభుత్వం భూమి ఇచ్చింది. కాకపోతే ఆ ప్రాంతమంతా కొండలు, గుట్టలతో నిండింది. కొన్నేళ్లుగా అలాగే వదిలేశారు. వీరిలోనే కొందరు కొండవాలును వ్యవసాయ యోగ్యంగా మార్చడంతో అందరిలోనూ ఆలోచన మొదలైంది. కొండలను సాగుయోగ్యంగా మార్చుకున్నారు. విషయం అధికారులకు తెలిసింది. దగ్గరుండి భూములను చదును చేయించారు. రాయితీలు అందాయి. ఉచిత విద్యుత లభించింది. డ్రిప్‌ తదితర సాంకేతిక ఆధునిక పరికరాలు నూరుశాతం సబ్సిడీతో సమకూరాయి. బ్యాంకులు వచ్చి రుణాలు అందించాయి. సాగు చేసిన పంట చేతికి రాగానే ప్రభుత్వం.. సబ్సిడీ ఇచ్చి ఆదుకొంది. 30 బోరుబావులు, విద్యుత కనెక్షన్లు, ట్రాన్స్ ఫార్మర్లు, 20 ప్యాక్‌ హౌస్ లను రాయితీతో రైతులు సమకూర్చుకున్నారు. ఇదే క్రమంలో ఊరికోసం చెక్‌డ్యామ్‌ని నిర్మించుకొన్నారు.

ఇప్పుడు కొండలు, గుట్టల్లోంచి మొలిచిన పచ్చనాకులా.. బక్కన్నగారిపల్లె కనిపిస్తుంది. పచ్చని అరటి గెలలతో తోటలు నిండుగా కనిపిస్తాయి. ఇక్కడి నుంచి అరటి గెలలు దిల్లీ మార్కెట్‌కు ఎగుమతవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా, ఈ గ్రామ ప్రజలని అభినందించారు. చంద్రబాబు ఎప్పుడూ అనే మాట నిజమైంది, రాయలసీమ రైతులకి సరిపడా నీరు ఇస్తే, రాతి నేలల్లో నిజంగానే బంగారం పండిస్తారు.

Advertisements