ఆనాటి ఇంద్రుడి ఆమరావతిలా ప్రస్తుత నవ్యాంద్ర రాజధాని ఆమరావతి వైభవంతో వెలుగొందాలని కోరుకొంటున్నానని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత అన్నారు. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో కవిత ప్రసంగిస్తూ, "గాంధీజీ పిలుపుతో ఇదే విజయవాడలో వందలాది మంది మహిళలు స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఒంటిపై నగలిచ్చి జైళ్లకు కూడా వెళ్లారు" అని కవిత విజయవాడని కూడా పొగిడారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, చివర్లో జై ఆంధ్రప్రదేశ్, జై తెలంగాణా ఆంటూ కవిత తన ప్రసంగాన్ని ముగించారు. కెసిఆర్ కుటుంబం, జై ఆంధ్రపదేశ్ అనటంతో, అక్కడ అందరూ సంతోషించారు. తెలుగువారు అందరూ కలిసి సోదర భావంతో మేలగటానికి, ఇలాంటివి ఉపకరిస్తాయి అని, అక్కడ ఉన్నవారు సంతోషించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక స్త్రీ, చరిత్రను లిఖిస్తుందని ఆనాడే గురజాడ అప్పారావు స్పష్టం చేశారన్నారు. మహిళా సాధికారత కోసం గురుజాడ అప్పారావు ఎనలేని సేవ చేశారని చెప్పారు. అమెరికా లాంటి మహిళా అధ్యక్షురాలు ఎన్నిక సాధ్యం కాలేదని అలాంటిది మనదేశంలో ఝాన్సీ లక్ష్మీబాయి, ఇందిరాగాంధీ లాంటీ ఎందరో మహిళలు రాజకీయాల్లో పాలనా వ్యవహారాలలో రాణించారన్నారు. వారిని స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. భారతీయ సంస్కృతిలోని రామాయణ, మహాభారత కథలను కుటుంబంలోని పెద్దలు పిల్లలకు తెలియజేయడం ద్వారా చిన్న వయస్సునుంచే నాయకత్వ లక్షణాలను తెలుసుకొనే అవకాశం ఏర్పడిందన్నారు.

దేశంలో నిరాక్షరాస్యులైన చాలా మంది తెలుగు రాష్ట్రాల మహిళలు ఆర్థిక విషయాలలో ఆదర్శవంతంగా నిలిచారన్నారు. తాను సంపాదించిన డబ్బును అవసరాలకు అనుగుణంగా ఖర్చు పెడుతూ పొదుపును పాటిస్తారని తెలిపారు. నేటి యువత, ముఖ్యంగా విద్యార్థినులు చదువులో రాణించాలని, చదువులేని మహిళల అనుభవాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ప్రపంచీకరణ నేపధ్యంలో మహిళలు అన్ని రంగాలలో ముందుకుసాగాలని దీనికి నాంది కుటుంబం నుంచే మొదలు కావాలన్నారు. మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత ప్రతి ఇంటి నుంచి ప్రారంభం కావడం ద్వారా మహిళ సాధికారతను సాధించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ వేదికలో మహిళలపై జరుగుతున్న హింస, వివక్షలపై చర్చ జరిగి ఒక తీర్మానం చేయాలని కోరారు. సారాకు వ్యతిరేకంగా ఉద్యమించిన రోశమ్మను ఆదర్భంగా తీసుకోవాలన్నారు.

మహిళా పార్లమెంట్ సదస్సుకు హజరయ్యే ముందు, ఆమె తొలుత కనకదుర్గమ్మను అమ్మవారిని దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా తెలుగు ప్రజలంతా ఒక్కటేనని కవిత స్పష్టం చేశారు. తెలుగువారంతా అన్నదమ్ములులా కలిసి మెలిసి ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ కు విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలన్నీ అక్షరాలా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.

Advertisements