బందరు.. ఈ పేరు వినగానే చటుక్కన గుర్తిచ్చేది లడ్డు... పుట్టినరోజు, శుభకార్యాలు, పెళ్లిళ్లు, పేరంటాలకు ఇది తప్పనిసరి. 77 ఏళ్ల చరిత్ర కలిగి ప్రత్యేక రుచిని సంతరించుకున్న బందరు లడ్డుకు జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ - జీఐ ధ్రువీకరణ పత్రం లభించింది.

బందరుకు మొదటిసారి ఎవరైనా వస్తే బందరు లడ్డును కొనుక్కొని తీసువెళ్లారంటే దాని ప్రత్యేకత ఇట్టే తెలిసిపోతుంది. స్వాతంత్ర్యం రాక పూర్వం నుంచే ఈ లడ్డు ఎంతో ఖ్యాతి వహించింది. తెలుగు ప్రజలు నివసించే ప్రాంతమేదైనా బందరు మిఠాయి దుకాణం అన్న పేరుతో కనిపిస్తుంటాయి. క్రమేపీ ఆ రుచి అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఢిల్లీ సుల్తానుల కాలంలో మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ సరిహద్దున ఉండే బుందేల్ఖండ్ నుంచి మచిలీపట్నం వలస వచ్చిన బొందిలీలు ఈ తొక్కుడు లడ్డు తయారీ ప్రారంభించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఇలా వలసవచ్చిన వారిలో బొందిలి రాంసింగ్ కుటుంబం తాయారు చేసిన ఈ లడ్డు ప్రపంచఖ్యాతిని పొందింది. వారు యుద్ధంలో ఉపయోగించే కత్తితో డాలును పొడుస్తు ఉండగా పలు రంద్రాలు ఏర్పడ్డాయి. దీంతో వారికి ఆలోచన తట్టి ఆ రంద్రాల్లోంచి పిండి పోసి మొదటి సన్నపూస తయారు చేశారు. ఆ తరువాత పూసను బెల్లంపాకంతో కలిపి తొక్కి లడ్డు రూపొందించారని పలువురు తయారీదారులు చెబుతుంటారు. అలా ప్రారంభమయి పట్టణం అంతటా విస్తరించింది. స్వాతంత్ర్యం వచ్చే నాటికే ఈ తయారీ పరిశ్రమ విస్తృతమయింది.

కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఈ లడ్డు తయారీ ద్వారా 250 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. పట్టణ వ్యాప్తంగా 125 నుంచి 150 దుకాణాల వరకు ఉంటాయి. మచిలీపట్నంతో పాటు పెడన గుడివాడ, విజయవాడలో దుకాణాలు వ్యాపించాయి. వాటి ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిమంది ఆధారపడి జీవిస్తున్నారు.

తయారీ విధానం:
బందరు లడ్డుతో పాటు ఇతర మిరాయిల్లోనూ బెల్లం మాత్రమే వినియోగించడం ఇక్కడి ప్రత్యేకత, ప్రతి మిఠాయి వంటకంలోనూ బెల్లాన్ని మాత్రమే వినియోగిస్తారు. కాలానుగుణంగా వస్తున్న మార్పులతో యాంత్రీకరణ అనివార్యంగా మారుతోంది. ఇప్పటికీ లడ్డులను చేతితో మాత్రమే తయారీ చేస్తారు. శనగ పిండి, బెల్లం, నెయ్యి మిశ్రమాలను వినియోగిస్తారు. శనగ పిండి, నీరు కలిపి మద్దగా చేసి దాని నుంచి పూస తయారు చేస్తారు. పూసను బెల్లం పాకంతో కలిపి రోటిలో వేసి రోకలితో తొక్కుతారు. అనంతరం లడ్డు తయారీ చేస్తారు.

Advertisements