పేదవారికి ఉచితంగా సీటీ స్కాన్ వంటి అధునాతన సౌకర్యాలు ప్రభుత్వ ఆసుపత్రులలో అందించటానికి చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని, అందులో భాగంగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్ ప్రారంభించామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు.

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పీపీపీ పద్దతిలో కోటీ ఇరవై ఐదు లక్షలతో ఏర్పాటు చేసిన 16 సైస్ సీటీ స్కాన్ యంత్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న పేదవర్గాలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించేందుకు సీటీ స్కాన్ ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ కాలేజీ ఆసుపత్రిలలో సీటీ స్కాన్ యంత్రాలను ఏర్పాటు చేయాలని చెప్పారని, త్వరలోనే వీటిని రాష్ట్రంలో అన్ని కాలేజీ ఆసుపత్రులలో ప్రారంభిస్తామని తెలిపారు.

గుండెకి సంబంధించి పరీక్షలు తప్ప అన్ని పరీక్షలు దీని ద్వారా అందిస్తామని తెలిపారు. సీటీ స్కాన్ను బయట డయాగ్నస్టిక్స్ సెంటర్లో చేయించుకుంటే రెండున్నర వేల వరకు అవుతుందని, అదే ఇక్కడ పేద రోగులకు ఉచితంగా అందించటానికి దీనిని ఏర్పాటు చేసామని తెలిపారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన బయోమెట్రిక్ విధానం వల్ల డాక్టర్స్ హాజరు శాతం పెరగటంతో ఓపీ రేటు పెరగటానికి ఉపయోగపడిందన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు 300 నుంచి 2500 మంది ఓపీ రేటు పెరిగిందని, ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం చేయించుకునే వారి సంఖ్య పెరిగిందని చెప్పారు. అదే విశాఖలో నాలుగు వేల మంది ఓపీకి ప్రతిరోజు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలుగా తీసుకుంటున్న మెరుగైన చర్యలు వల్ల ప్రభుత్వ ఆసుపత్రిలలో అవుట్ పేషెంట్ రేషియో 28 శాతానికి పెరిగిందని తెలిపారు. డెలివరీల శాతం 12 శాతం పెరిగాయని చెప్పారు.

ఇలా ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని సౌకర్యాలు కల్పించటం వల్ల ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య తగ్గిందని ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు వారు ఫిర్యాదు చేస్తున్నారన్నారు. ఇంకా పేదవారికి పూర్తిగా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావటానికి కృషి చేస్తామన్నారు. గర్భిణులకు డెలివరీ అనంతరం వెయ్యి రూపాయల చెక్ తో పాటు మదర్ కిట్ తో పాటు తల్లీ,బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా సేస్టీగా ఇంటికి వెహికిల్ ఇచ్చి పంపిస్తున్నామన్నారు.

సిటీ స్కాన్ ప్రారంభ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్రావు, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ జగన్మోహన్రావు, సీటీ స్కాన్ యంత్రాన్ని పీపీపీ పద్దతిలో ఏర్పాటు చేసిన రేడియాలజిస్ట్ రమణ కుమార్,ఆర్ఎంవోలు ప్రభుత్వ వైద్యులు,నర్సులు ప్రభుత్వ సిబ్బంది తదితరలు పాల్గొన్నారు.

Advertisements