ప్రకాశం బ్యారేజీ, విజయవాడ - గుంటూరును కలిపే ఈ వారధి, మంచి టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు, స్యుసైడ్ స్పాట్ కూడా... నిత్యం ఎన్నో సమస్యలతో సతమతవుతూ, జీవితాలని ముందుకు తీసుకువెళ్ళాలేక, ప్రజలు ఇక్కడకు వచ్చి, ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు చూసాం...

ప్రకాశం బ్యారేజీ మీద జన సంచారం ఎక్కువే, ఆయనా సరే, ఎవరన్నా ఆత్మహత్య చేసుకునేందుకు కృష్ణా నదిలో దూకితే, ఎప్పుడో కొన్ని సందర్భాలలో తప్ప, ప్రజలు రక్షించే పని చెయ్యరు, కనీసం పోలీస్కు కూడా సమాచారం ఇవ్వరు... ఎవడు ఎట్లా పొతే మనకెందుకులే అనుకునే ఈ రోజుల్లో, ఇలాంటి వారిని కాపాడడమే తన పని అన్నట్లుగా ఓ హెడ్‌ కానిస్టేబుల్‌. ప్రకాశం బ్యారేజీ పై, నిత్యం అలెర్ట్ గా ఉంటూ, ఇప్పటి వరకు సుమారు 100 మంది ప్రాణాలను కాపాడారు ఈయన.

ఈయన పేరు, బండ్ల నాగేశ్వరరావు. తాడేపల్లి పోలీస్‌ స్టేషన్లో హెడ్‌ కానిస్టేబుల్. ప్రకాశం బ్యారేజీపై ఔట్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్నారు. ఔట్‌పోస్టు కు మాత్రమే, ఆయన విధులు పరిమితం చేసుకోవచ్చు... కాని, ఆయన మానవతా కోణంతో, ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వారిని కాపాడతారు. ఔట్‌పోస్టు లో మాత్రమే కూర్చోకుండా, బ్యారేజీపై తిరుగుతుంటారు. ఏ వ్యక్తిపై అనుమానం కలిగినా వారిని నీడలా వెంటాడుతుంటారు. వారు ఆత్మహత్య చేసుకునేందుకు నీటిలో దూకే ప్రయత్నంలో ఉండగానే వెనుక నుంచి వారిని గట్టిగా పట్టుకుంటారు. అక్కడ నుంచి పక్కకు తీసుకెళ్ళి ఇంట్లో వారికి ఫోన్‌ చేసి కనుక్కుంటారు. వారిని నయానో, భయానో ఔట్‌పోస్టులోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి కౌన్సెలింగ్‌ ఇస్తారు.

ఈ విధంగా ఇప్పటి వరకు సుమారు 100 మంది వరకు కాపాడి ఉంటాడని అంచనా. నీటిలో దూకిన నలుగురైదుగురిని కూడా కాపాడాడు. ఆయన పనితీరు, సమర్థతను గుర్తించిన అర్బన్‌ ఎస్పీ త్రిపాఠీ ఆదివారం తన కార్యాలయానికి పిలిపించుకుని రూ.2 వేల నగదు రివార్డు అందించి అభినందించారు.

Advertisements