ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో బెంజిసర్కిల్‌ వద్ద గల సర్వోత్తమ భవన్‌లో ఈ నెల 22, 23 తేదీల్లో ఉచితంగా పుస్తకాలను అందజేయనున్నట్లు సంఘం ప్రధాన కార్యదర్శి రావి శారద ఒక ప్రకటనలో తెలిపారు. చదవడం, ప్రచురణ, కాపీరైట్‌ ద్వారా మేథోసంపదను సంరక్షించడం వంటి కార్యక్రమాలను వృద్ధి చేయడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 23వ తేదీన అంతర్జాతీయ పుస్తక కాపీరైట్‌ దినోత్సవం సందర్భంగా పుస్తకాలను ఉచితంగా నగర వాసులకు అందజేస్తున్నామన్నారు.

పిల్లల పుస్తకాలతో పాటు పాత, కొత్త కలయికతో వివిధ విషయాల్లో గల అనేక వేల పుస్తకాల నుండి పాఠకులకు వారికి ఇష్టమైన పుస్తకాలను ఎంపిక చేసుకోవచ్చన్నారు. సాహిత్యం, తత్వశాస్త్రం, అధ్యాత్మికం, సాంఘికశాస్త్రాలు, భాషాశాస్త్రం, మెడిసిన్‌, ఇంజనీరింగ్‌, కామర్స్‌, రాజకీయ, ఆర్థికశాస్త్రాలు తదితర పుస్తకాలను సేకరించి, కావలసిన వారికి అందించనున్నట్లు తెలిపారు. 30 వేల పుస్తకాలు సేకరించామని, ఏప్రిల్‌ 22, 23తేదీల్లో ఉదయం పది నుండి సాయంత్రం ఐదు గంటల వరకు విజయవాడ బెంజిసర్కిల్‌ ఎదురుగా గల శ్రీ సర్వోత్తమ భవనంలో కార్యక్రమం ఏర్పాటుచేసినట్లు తెలిపారు.

గత సంవత్సరం విజయవాడ, గుంటూరు, విజయనగరం ప్రాంతాల్లో, 50 వేల పుస్తకాలు విషయ ప్రాతిపదికన విభజించి పంపిణీ చేసినట్లు తెలిపారు. నాటి ప్రజా స్పందనను గమనించి ఈ సారి మరింత విస్తృత స్థాయిలో పుస్తకాలను అందించడానికి నిర్ణయించినట్లు తెలిపారు. విద్యార్థులు, యువకులతో పాటు వయో బేధం లేకుండా నగర ప్రజానీకం అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి నచ్చిన పుస్తకాన్ని ఉచితంగా తీసుకువెళ్లవచ్చని కోరారు.

పుస్తకాలు పొందడానికి కృష్ణాజిలా వారు 9290670671, 8520926313 ఫోన్‌ నెంబర్లను, గుంటూరు జిల్లా వారు 9533562539, 8008331880 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.

Advertisements