ఐటీ రంగంలో ప్రసిద్ధి చెందిన దిగ్గజ సంస్థల్లో ఒకటైన హెచ్‌సీఎల్ తన కార్యకలాపాలను మే నెల నుంచి విజయవాడ కేంద్రంగా ప్రారంభించనుంది. రూ.500 కోట్ల పెట్టబడితో ఆ సంస్థ నవ్యాంధ్రలో బీపీఓలను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు, హెచ్‌సీఎల్ వ్యవస్థాపకులు శివ నాడార్ల సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. వచ్చే నెల నుంచి ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహించడానికి సన్నద్ధమవుతోంది.

కేసరపల్లి వద్ద 11 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ఆ సంస్థకు కేటాయించింది. అందులో ఆకర్షణీయమైన డిజైన్లతో బీపీఓ నిర్మాణ పనులను ప్రారంభించ నుంది. భవన నిర్మాణాలు పూర్తయ్యేలోపు గన్నవరం సమీపం లోని మేధ టవర్స్ ప్రాంగణంలో తాత్కాలికంగా బీపీఓ కార్యకలాపాలను మొదలుపెట్టనుంది.

త్వరలో ఆ సంస్థ నుంచి ప్రతినిధుల బృందం విజయవాడకు వచ్చి ఈ పనులను ప్రారంభించి పర్యవేక్షించనున్నారు. హెచ్‌సీఎల్ రాక రాష్ట్ర ఐటీ రంగంలో ఒక పెద్ద కదలిక తేవడానికి దోహద పడుతుందని అధికారులు భావిస్తున్నారు. దీని బాట లోనే మరిన్ని సంస్థలు రాష్ట్రానికి రావడానికి ఆసక్తి ప్రదర్శిస్తాయని అంచనా వేస్తున్నారు.

మేధ టవర్స్ ప్రాంగణంలో, మొదట వెయ్యి మందితో కార్యకలాపాలు ఆరంభించనున్నట్లు సమాచారం. దాంతో పాటు స్థానికంగా ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆ సంస్థ నైపుణ్య శిక్షణ కూడా ఇవ్వనుంది. శిక్షణ పూర్తయ్యాక వారికి ఉద్యోగావకాశాలూ కల్పించనుంది.

Advertisements