సంక్రాంతికి విజయవాడ నగరవాసులని అలరించిన ఏవియేషన్ షో మర్చిపోక ముందే, ఇప్పుడు మరో ఈవెంట్ నగర వాసులని అలరించనుంది. ఫిబ్రవరి 4న నగరంలోని పన్నమి, భవానీ ఘాట్లలో నేవీ ఆపరేషనల్ డెమో నిర్వహించటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బాబుఎ తెలిపారు.

కలెక్టర్ మాట్లాడుతూ నూతన రాజధాని అమరావతిలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు, యువతను భాగస్వాములను చేసి వారిలో దేశ రక్షణకు సంబంధించిన ఉద్యోగాలకై స్పూర్తి నింపేందుకు ఎయిర్ షో వంటి అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. దీనిలో భాగంగా ఫిబ్రవరి 4న నేవీ ఆపరేషనల్ డెమో నిర్వహించడం జరుగుతుందన్నారు.

ప్రదర్శనలో చేతక్ హెలీకాప్టర్లతో యుద్ధ విన్యాసాలు, టెర్రరిస్ట్ల దాడులు ఎదుర్కొనే పద్ధతులు, ప్రమాదాల్లో చిక్కుకున్నవారిని రక్షించే విన్యాసాలు ఈ ప్రదర్శనలో వుంటాయని వివరించారు. అదే విధంగా విద్యారులకు నేవీలో ప్రవేశానికి కావలసిన కెరీర్ గైడెన్స్లతో పాటు భారత దేశానికి నేవీ అందిస్తున్న సేవలను ప్రత్యేక స్టాల్స్ ద్వారా ప్రదర్శనల్లో ఉంచుతున్నట్లు తెలిపారు. స్కైడైవింగ్ వంటి విన్యా సాలు ఉంటాయని చెప్పారు.

ఫిబ్రవరి 2, 3 తేదీల్లో రిహార్సల్స్ నిర్వహిస్తామని, ఫిబ్రవరి 4వ తేదీన నిర్వహించే ఆపరేషనల్ డెమోను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, నేవెల్ కమాండర్ ఇన్ చీఫ్ ప్రారంభిస్తారన్నారు. ఈ డెమోకు ప్రవేశం ఉచితమని సుమారు మూడు నుండి నాలుగు లక్షల మంది ప్రదర్శనను తిలకించేలా ఏర్పాట్ల చేశామన్నారు. ఫిబ్రవరి 5న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రసిద్ధి చెందిన ప్రఖ్యాత నావెల్ బ్యాండ్ ప్రదర్శిస్తారన్నారు. ఈ ప్రదర్శనలో మ్యూజిక్ ఆఫీసర్ తో పాటు 35మంది సైలర్లు సభ్యులుగా ఉంటారన్నారు.

Advertisements