విజయవాడ నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాల ప్రక్రియను మెరుగుపర్చేందుకు సాంకేతికతను జోడించి వేగంగా చెత్తను తరలించేందుకు స్మార్ట్ డంపర్ బిన్ విధానానికి అధికారులు శ్రీకారం చుట్టారు. నగరంలోని లయోలా కళాశాల రహదారి వెంట పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఇది విజయవంతమైతే నగరంలోని 59 డివిజన్లకు విస్త స్తారు. ఈ విధానంతో చెత్త సేకరణ, తరలింపు సులభతరంగా మారుతుందని భావించిన ఉన్నతాధికారులు ఆయా స్మార్ట్ డంపర్ బిన్ విధానాన్ని ప్రయోగాత్మకంగా నగరంలోని తూర్పు నియోజకవర్గంలోని లయోలా కళాశాల ప్రాంతంలో ప్రారంభించారు.

ఇవి ఎలా పని చేస్తాయి అంటే..
ఈ స్మార్ట్ డంపర్ బిన్ లను భూమిలోపల అమర్చుతున్నారు. దీంతో ఇది పైకి అంతగా కనిపించదు. దానికి సెన్సారింగ్ విధానం అనుసంధానం చేస్తారు. దీంతో చెత్త నిండిన తదుపరి ప్రత్యేక నియంత్రణ, సెన్సారింగ్ విధానంలో అధికారులకు SMS అందుతుంది. సామాచారం అందుకున్న వారు, ఈ మేరకు సిబ్బందిని అప్రమత్తం చేసి, బిన్ను ఖాళీచేసి చెత్తను వాహనంలో తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారు.

ముందుగా 10 అడుగుల పొడవు గల గొయ్యి తీసి, అందులో ప్రత్యేకంగా రూపొందించిన డంపర్ బిన్ ఉంచుతారు. లోపాలకి వెళ్ళగా, బయటకి 4 అడుగుల్లో బిన్ ఉంటుంది. తర్వాత మూడు వైపులా ప్రత్యేకంగా గోడలు అమర్చుతారు. టైల్స్ సైతం అమర్చి అత్యంత సుందరంగాను, దుర్వాసన వెలువడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆయా స్మార్ట్ డంపర్ బిన్ 1.5 టన్నుల వరకు చెత్త నింపేందుకు అవకాశం ఉండగా, అందుకు అనువుగా ప్రత్యేకంగా ఒక్కొక్క బిన్లో పాలీప్రాపిలిన్ డర్పల్ బ్యాగులను అమర్చుతారు. ఆయా బ్యాగులను చిన్నపాటి తాడుతో పకడ్బందీగా కట్టి ఉంచుతారు. చెత్తను తరలించే సందర్భంగా స్మార్ట్ బిన్ లోని బ్యాగులను తొలగించి నేరుగా వాహనంలోకి దిగుమతి చేస్తారు. ఆ పై తిరిగి బ్యాగును బిన్ లో అమర్చేలా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం భూమిలోపల ఉండడంతో చెత్త అధికమై రహదార్లపై పడడం, కుక్కలు, పందులు వంటివి అక్కడకు రావడం లాంటివి జరగవని అధికారులు పేర్కొంటున్నారు.

Advertisements