ప‌విత్ర పుణ్య‌క్షేత్ర‌మైన ఇంద్రకీలాద్రిపై కొలువైన క‌న‌క‌దుర్గమ్మ ఆలయంలో అష్టలక్ష్మిల ముందు బుధ‌వారం ఉద‌యం అరుదైన నక్షత్రతాబేలు కనిపించింది. నిత్య పంచహారతుల వెండి సామాగ్రిని కడుగుతుండగా పూలకుండీల చాటున తాబేలు సిబ్బందికు కనిపించింది. దీంతో వెంటనే ఆలయ సిబ్బంది ఈ స‌మాచారాన్ని దుర్గ‌గుడి ఈవో సూర్యకుమారి దృష్టికి తీసుకువెళ్ళారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ సహజంగా దట్టమైన అటవీ ప్రాంతాలలో ఎండుటాకుల మద్య మట్టిలో జీవించే అరుదైన నక్షత్ర తాబేలును మహాలక్ష్మీ స్వరూపంగా కొలుస్తారన్నారు. అలాంటి అరుదైన ఈ వన్యప్రాణి దుర్గ‌మ్మ సన్నిధిలో అష్టలక్ష్ముల వద్ద దర్శనమీయడం శుభసంకేతమని అన్నారు. దీనిని ఏ విధంగా సంరక్షించాలనేది నిపుణులను సంప్రదిస్తామని తెలిపారు.

ఇంద్రకీలాద్రి కొండప్రాంతం నుండి ఈ తాబేలు జారిపడి వుంటుందని అక్కడి ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. శ్రీలక్ష్మీనారాయణ స్వరూపంగా భక్తులు కొలిచే అరుదైన కూర్మం అమ్మవారి సన్నిధిలో దర్శనమీయడం అదృష్టం అని, అమ్మవారి దర్శనంతో పాటు కూర్మదర్శనం అవ‌డం త‌మ పూర్వజన్మ సుకృతమని దివ్యదర్శనము పధకము ద్వారా విజయనగరం జిల్లా నుండి వచ్చిన యాత్రికులు త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

Advertisements