ప్రకాశం ఆనకట్ట దిగువ అప్రాన్ పై ఆదివారం నుంచి ద్విచక్రవాహనాల రాకపోకలకు జలవనరులశాఖ ఆమోదం తెలిపింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాహనాలను అనుమతించాలని నిర్ణయించారు. దీనికి అవసరమైన మార్గాన్ని చూపే విధంగా అప్రాన్ పై సున్నంతో మార్కింగ్ చేశారు.

గేట్ల మార్పిడి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆనకట్ట పై నుంచి వాహనాలు రాకపోకలను వచ్చేనెల 24 వరకు నిలిపివేశారు. ఫలితంగా గుంటూరు జిల్లా వైపు ఉన్న తాడేపల్లి, మంగళగిరి, తాడికొండ, తుళ్ళూరు మండలాలకు చెందిన రైతులు, రోజు వారీ పని చేసుకునేవారితో పాటు విద్యార్థులు విజయవాడ రాకపోకలు సాగించాలంటే అదనంగా ఏడుకిలో మీటర్లు ప్రయాణించాల్చి వస్తుందని, దీని వల్ల ఆర్ధిక భారం పడటమేకాక సమయం వృధా అవుతుందని తెదేపా నియోజకవర్గ ఇంచార్జ్ గంజి చిరంజీవి, మండల శాఖ అధ్యక్షుడు దండమూడి మనోజ్ కుమార్, జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు, జిల్లాకు చెందిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకి వివరించారు.

అంతేకాకుండా సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు కూడా జలవనరుల శాఖ మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. అందరి విజ్ఞాపనలను పరిగణనలోకి తీసుకున్న మంత్రి ఉమామహేశ్వరరావు అప్రాన్ పై ద్విచక్ర వాహనాలు రాకపోకలకు అవకాశం కల్పించారు. దీంతో నాలుగు మండలాల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisements