డయల్‌ 100... అత్యవసర పరిస్ధితుల్లో ఉన్నప్పుడు, సహాయం కోసం చేసే ఫోన్ నెంబర్... విజయవాడలో పండిట్‌ నెహ్రూ బస్టాండు దగ్గర ఉన్న, పోలీస్‌ కంట్రోల్‌ రూంకు ఈ నెంబర్ అనుసంధానం అయ్యి ఉంటుంది. ఎంతో మంది ఈ నెంబర్ కు ఫోన్ చేస్తూ ఉంటారు. ఇది వరకు పరిస్థితి ఎలా ఉన్నా, ఇప్పుడు మట్టికి విజయవాడ పోలిసులు మెరుపు వేగంతో స్పందిస్తూ, సమస్యలను పరిష్కారం చేస్తున్నారు. పోలీసులు అతి తక్కువ సమయం, సగటున సమయం..6 నిమిషాల16 సెకన్లలో ఘటనాస్థలానికి చేరుతూ, అమెరికా పోలీసులని దాటి రికార్డు సృష్టిస్తూ, ప్రజలకు చేరువ అవుతున్నారు.

పోలీస్‌ కంట్రోల్‌రూం 100కు ఫోన్‌ చేయగానే పోలీసు సిబ్బంది దానికి స్వీకరిస్తారు. విజయవాడ పోలీస్‌ కంట్రోల్‌రూంలో మూడు లైన్లు ఉన్నాయి. విజయవాడ వ్యాప్తంగా ఉన్న గస్తీ వాహనాలు, పోలీసుస్టేషన్లు, రక్షక్ వాహనాలు, అగ్నిమాపక కేంద్రాలు, అంబులెన్సులు, జాతీయ రహదారి గస్తీ వాహనాలు వంటివాటన్నింటినీ ఈ కంట్రోల్‌ రూమ్‌తో అనుసంధానిస్తారు. ఇక్కడకు వచ్చే ప్రతి ఫోన్‌ కాల్‌ ఏ ప్రాంతం నుంచి వచ్చిందని గుర్తించే వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఆ ప్రాంతంలో ఉండే వారిని అప్రమత్తం చేసి అవసరమైన అత్యవసర సేవలందిస్తున్నారు. ఇలా చేరుకునే సమయం విజయవాడలో అత్యంత తక్కువగా సగటున 6.16 నిమిషాలుగా నమోదవుతోంది.

ప్రపంచ దేశాల్లో కంట్రోల్‌రూం కేంద్రానికి వచ్చిన ఫోన్‌ కాల్స్‌కు పోలీసు సిబ్బంది హాజరయ్యే సమయాన్ని పోలిస్తే విజయవాడ పోలీసులు తక్కువ సమయంలోనే హాజరవుతున్నారు. ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీ పడుతోందని చెబుతున్నారు. విజయవాడ నగర పరిధి తక్కువగా ఉండడం కూడా సంఘటనాస్థలికి సత్వరమే వెళ్లడానికి దోహదపడుతోంది. బెజవాడ పోలీస్ సగటున 6.16 నిమిషాల్లో ఘటనా స్థలానికి వెళ్తుంటే, న్యూయార్క్ 9.1 నిమిషాల్లో, డల్లాస్ 8.0 నిమిషాల్లో, లోస్ ఏంజెల్స్ 8.3 నిమిషాల్లో, అట్లాంటా 12 నిమిషాల్లో, లండన్ 15 నిమిషాల్లో, స్కాట్లాండ్ 11 నిమిషాల్లో, టోక్యో 7.3 నిమిషాల్లో, సింగపూర్ 15 నిమిషాల్లో చేరుతున్నారు.

అయితే, ప్రధానమైన సమస్య, పోలీస్‌ కంట్రోల్‌రూం కాల్‌ను చాలా మంది దుర్వినియోగం చేస్తుంటారు. బ్లాంక్‌ కాల్స్‌ చెయ్యటం, పిల్లలు సరదాగా చెయ్యటం, కావాలని పోలీసులని ఇబ్బంది పెట్టటం లాంటివి చేస్తూ, పోలీసు సహనానికి పరీక్ష పెడుతారు. రోజుకి సగటున 3 వేల కాల్స్ వస్తే, 150 కాల్స్ నిజంగా అవసరం ఉన్నవాళ్ళు చేసేవి.

Advertisements