ప్లాట్-ఫాం పై సైబర్ కేఫ్... అందరికీ అందుబాటులో బడ్జెట్ హోటల్... రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు వినోదాన్నిఅందించేందుకు మల్టీప్లెక్స్.... ఇది విజయవాడ రైల్వేస్టేషన్ భవిష్యత్తు రూపం. ప్రయాణికుల నుంచి ప్రముఖుల వరకు అందరితోనూ పెదవి విరుపులను చూస్తున్న బెజవాడ స్టేషన్ మహా సుందరాతి సుందరంగా తయారు కానుంది. కార్పొరేట్ రైలు నిలయంగా మారనుంది. ఇందుకు సంబంధించిన అడుగులు ఈ నెల ఎనిమిదో తేదీన ముందుకు పడనున్నాయి.

రైల్వేస్టేషన్లలో నాణ్యత ప్రమాణాలతో మౌలిక వసతుల కల్పించడంతో పాటు ప్లాట్-ఫాంను కూడా అభివృద్ధి చేస్తారు. ఈ స్టేషన్ ఆధునీకరించడం ద్వారా వాణిజ్య కార్యకలపాతో పాటు అదనపు ఆదాయం సమకూరే విధంగా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. రైల్వేస్టేషన్ ఆధునీకరించడంలో భాగంగా వాణిజ్య కార్యకలపాలకు అనువుగా హోటల్స్, మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్స్ ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏడు ప్లాట్‌ఫారాలపై విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఒకటో, ఆరు నంబర్‌ ప్లాట్‌ఫారాలపై మాత్రమే విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు ఉన్నాయి. రైల్వేస్టేషన్‌లో ప్రస్తుతం ఇస్తున్న ఫ్రీ వైఫై కొంత సమయానికే పరిమితం చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులందరికీ ఇంటర్నెట్‌ను 24/7 అందుబాటులో ఉండేలా చేయడానికి సైబర్‌ కేఫ్‌లను నెలకొల్పుతారు.

ఒకవేళ రైలు రెండు, మూడు గంటలు ఆలస్యమైతే, ప్రయాణికులకు బోరు కొట్టకుండా వినోదాన్ని అందించడానికి మల్టీప్లెక్స్‌లను నిర్మిస్తారు. ఇప్పటికే పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌లో వై స్కీన్స్‌ పేరుతో రెండు మల్టీప్లెక్స్‌ స్ర్కీన్స్‌ ఉన్నాయి. త్వరలో ఈ మల్టీస్ర్కీన్స్‌ విజయవాడ రైల్వేస్టేషన్‌లో అడుగుపెట్టబోతున్నాయి

విజయవాడ రైల్వేస్టేషన్ 1888లో ప్రారంభించారు. మన దేశం నాలుగు దిక్కులను కలిపే ఏకైక రైల్వే జంక్షన్ ఇది. ఈ రైల్వేస్టేషన్ రాజధాని అమరావతికి ముఖద్వారంగా ఉంది. సుమారు పదెకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న విజయవాడ రైల్వేస్టేషన్‌లో మొత్తం పది ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. ఈ స్టేషన్ మీదుగా రోజు 375 పైగా ప్యాసింజర్, ఎక్ష్ప్రెస్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో పాటు మరో 150 పైగా సరకు రవాణా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. రోజూ కనీసం లక్షమంది ప్రయాణీకులు సేషన్ కు వస్తుంటారు. ప్రతి రోజు విజయవాడ రైల్వేస్టేషన్ కు రూ.70 లక్షల ఆదాయం లభిస్తుంది.

Advertisements