విజయవాడ నగరాన్ని మెట్రోపాలిటన్ ప్రాంతంగా గుర్తిస్తూ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. మెట్రో రైలు ప్రాజెక్టు రావాలంటే ఆ నగరానికి మెట్రో హోదా తప్పనిసరి. ఈ దృష్ట్యా నగరపాలక సంస్థ పాలక మండలి విజయవాడతో పాటు శివారు ప్రాంతాల్ని కలుపుతూ మెట్రో నగరంగా మారుస్తూ గతంలోనే తీర్మానం చేసింది. ఆ తీర్మానానికి కొనసాగింపుగా ఇవాళ పట్టణాభివృద్ధి శాఖ ఈ ప్రాంతాన్ని మెట్రోపాలిటన్ గా గుర్తిస్తూ 104జీవో జారీచేసింది. పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్ ఈ మేరకు ఆదేశాలిచ్చారు. విజయవాద సహా 19 గ్రామాలను కలిపి మెట్రోపాలిటన్ ఏరియాగా తీర్మానం చేసారు.

విజయవాడ వంటి 59 డివిజనులు ఉన్న నగరం పరిధిలోకి మెట్రో రైల్ ప్రాజెక్టు రాదు. ఇప్పటికే విజయవాడ పరిధి దాటిపోయింది. ఏ నగరంలో మెట్రో పనులు ప్రారంభించాలన్నా ఆ ప్రాంతం మెట్రోపాలిటన్ ఏరియాగా ఉండాల్సి ఉంటుంది. మెట్రోపాలిటన్ ఏరియా వేరు. మెట్రోపాలిటన్ సిటీ వేరు. మెట్రోపాలిటన్ ఏరియా అంటే, భవిష్యత్తులో విలీనానికి అవకాశం ఉన్న ప్రాంతాలుగానే చెప్పకోవాల్సి ఉంటుంది. మెట్రో ప్రాజెక్టు పనులు ప్రారంభించటానికి వీలు కల్పిస్నూ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మెట్రోరైల్ ప్రాజెక్టుకు సంబంధించి 10 లక్షల జనాభా విధిగా కలిగి ఉండాల్సిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వ విజయవాడను మెట్రోపాలిటన్ ఏరియాగా ప్రకటించటంతో కధ సుఖాంతమొంది.

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కూడా త్వరలో విజయవాడను మెట్రోపాలిటన్ గా నోటిఫై చేయాల్సి ఉంది. ఆ ప్రక్రియ పూర్తయితే అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడుతుంది. తాజా ఉత్తర్వులతో మెట్రో రైలు పనులకు మార్గం సుగమం అయిందని అమరావతి మెట్రో రైలు కార్పొరేష‌న్ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు.

కేవలం మెట్రో రైలు నిర్మాణం చేపట్టబోయె గ్రామాలను మాత్రమే మెట్రోపాలిటన్ ఏరియాగా గుర్తించారు. అలా గుర్తించిన గ్రామాలను విజయవాడ కార్పొరేషన్ లో విలీనం చేయడానికి జీఓ ఏమీ విడుదల చేయలేదు. మరి ఈ గ్రామాలు, విజయవాడ కార్పొరేషన్ లో విలీనం చేస్తారో లేదో, చూడాలి.

ఇవి మెట్రోపాలిటన్ ఏరియాలో కలిసే గ్రామాలు
గన్నవరం వైపు: రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికెపాడు, నిడమానూరు, దొనె ఆత్కూరు, గూడవల్లి, కేసరపల్లి, బుద్దవరం, గన్నవరం
పెనమలూరు వైపు: కానూరు, పోరంకి, తాడిగడప, యనమలకుదురు, పెనమలూరు
గొల్లపూడి వైపు: జక్కంపూడి, గొల్లపూడి
నూజివీడు వైపు: నున్న, పాతపాడు, అంబాపురం

Advertisements