అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకని, రేపు (మార్చి 8 బుధవారం) విజయవాడ మహిళలకు గుర్తుండిపోయేలా పోలీస్ కమీషనర్ గౌతం సవాంగ్ వినూత్నంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నగరంలోని మహిళలు, యువతలకు ఈవ్ టీజర్ల నుంచి రక్షణ కల్పించడానికి మహిళా రక్షక్లను రంగంలోకి చింపారు. తాజాగా ఇప్పుడు వారి కోసం ఆఫర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో మహిళలకు ఆటోలో ఉచిత ప్రయాణంతో పాటు, విజయవాడలోని క్లాత్‌ షోరూమ్‌లలో 20 శాతం డిస్కౌంట్‌ ఆఫర్ ఇవ్వాలని ఆదేశించారు.

ఆటోలో ఉచిత ప్రయాణానికి సంబంధించి ఆయా పోలీస్ స్టేషన్ సీఐలు తమ పరిధిలో గల ఆటో యూనియన్ నాయకులతో సంప్రదింపులు జరిపారు. ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో రోజుకు ఎన్ని ఆటోలు తిరుగుతాయో అవన్నీ బుధవారం మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించాలి. వారి నుంచి డబ్బులు వసూలు చేయకూడదు. విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీసు స్టేషన్ల సీఐలు ఈ విధంగా ఆటో యూనియన్లను ఒప్పించారు. ఈ సదుపాయం మహిళా దినోత్సవం రోజు మాత్రమే.

ఆటోల్లో ఉచిత ప్రయాణమే కాకుండా వస్తాల కొనుగోలు పైనా భారీ డిస్కౌంట్లు ఇచ్చేలా పోలీసులు ఆయా వ్యాపారులను ఒప్పించారు. నగరంలోని మహాత్మాగాంధీ రోడు, కారల్ మార్క్స్ రోడ్డు, వస్త్రాలత లో ఎన్నో బట్టల షాపులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వీటిలో ఎలాంటి వస్త్రాలు కొనుగోలు చేసినా 10 నుంచి 20 శాతం డిస్కౌంట్ ఇచ్చేలా ఏర్పాటు చేశారు. వాస్తవానికి 25 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వాలని పోలీసులు, వ్యాపార వర్గాలను కోరారు. వాళ్లు మాత్రం 10 నుంచి 20శాతం వరకు ఇవ్వడానికి అంగీకరించారు. వస్త్రలతతో పాటు అన్ని ప్రముఖ, మధ్యతరగతి షాపుల్లోనూ ఈ డిస్కౌంటు మహిళలకు దక్కుతాయి.

కంకిపాడులోని వస్త్ర వ్యాపారులు మాత్రం మరో అడుగు ముందుకేశారు. మహిళలు బుధవారం కోనుగోలు చేసే వస్త్రాల పై 50 శాతం డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించారు.

బందర్ రోడ్డులో ఉన్న పీవీపీ మాల్ లో కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నుంచి ఓ ప్రత్యేకత కనిపించనున్నది. ఇప్పటి వరకు ఇక్కడికి వెళ్లిన వాహనాలన్నీ (పురుషులు, మహిళలు) కలిపి పార్కింగ్ చేయించేవారు. ఇక నుంచి మహిళలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాన్ని కేటాయిస్తున్నారు. దీనికి పింక్ పార్కింగ్ అని నామకరణం చేశారు. అలాగే ఆ మాల్లో ఉన్న షాపుల్లో ఎలాంటి వస్తువు కొనుగోలు చేసినా రేపు (మార్చి 8 బుధవారం) 50 శాతం డిస్కౌంట్ ఇస్తారని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి.

మహిళలకు ప్రత్యేక ఎల్‌ఎల్‌ఆర్‌ మేళా
మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న విజయవాడ ఉపరవాణా కమిషనర్‌ కార్యాలయంలో మహిళలకు ప్రత్యేక ఎల్‌ఎల్‌ఆర్‌ మేళాను నిర్వహిస్తున్నట్లు ఉపరవాణా కమిషనర్‌ ఇ.మీరాప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన‌వారు దీనికి అర్హులు. ఎల్‌ఎల్‌ఆర్‌ కావాల్సిన వారు వయస్సు, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌ కార్డు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలి. www.aptransport.org లేదా మీసేవ కేంద్రంలో 8వ తేదీ మహిళల ప్రత్యేక ఎల్‌ఎల్‌ఆర్‌ మేళాకు స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఉపరవాణా కమిషనర్‌ కార్యాలయంలో స్పాట్‌ స్లాట్‌ బుకింగ్‌ సౌకర్యం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోటారు సైకిల్‌ లేదా కారు ఒక్కదానికి రూ.260, మోటారుసైకిల్‌, కారు రెండింటికి అయితే రూ.410లు రుసుము చెల్లించాలి. మధ్యవర్తులను ఆశ్రయించకుండా మహిళలు నేరుగా ఎల్‌ఎల్‌ఆర్‌ మేళాకు హాజరు కావాలని కోరారు.

Advertisements