ఆకుపచ్చ కోక కట్టిన నేలతల్లి! కనువిందు చేస్తోంది! ఏ కోనసీమలోనిదో కాదు! కృష్ణా డెల్టాలోనిదీ కాదు! ఒకప్పుడు ఫ్యాక్షన్‌తో అట్టుడికిన ప్రాంతం.. కక్షలతో ఉక్కిరిబిక్కిరై..ఊళ్లకుఊళ్లు ఖాళీ అయిన జిల్లా. ఒకవైపు కరువుకాటు మరోవైపు ఫ్యాక్షన్ గొడవలు. ఉపాధికోసం సొంతూరును వదిలి వలసవెళ్లిన జీవితాల్లో మార్పు కనిపిస్తోంది. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుతో అనంతపురంజిల్లా సస్యశ్యామలం అవుతోంది.

రైతుకు నీళ్లిస్తే పొలంలో బంగారం పండిస్తాడు! తాను బతుకుతూ... పది మందిని బతికిస్తాడు! దేశం ఆకలి తీరుస్తాడు! ఇది అక్షరాలా నిజమని అనంతపురం జిల్లా రైతులు నిరూపిస్తున్నారు. నీరు ఇచ్చిన అండతో పచ్చటి పైరు పండిస్తున్నాడు. దీనంతటికీ బీజం... పట్టిసీమలో పడింది. పట్టిసీమ ద్వారా ఈ ఏడాది తొలిసారిగా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తీసుకురావడం తెలిసిందే. ఆ మేరకు శ్రీశైలం నుంచి కిందికి వెళ్లాల్సిన నీటిని రాయలసీమ జిల్లాలకు మళ్లించారు. హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు నీటిని పంపి.. అక్కడి నుంచి అనంతపురం జిల్లాలోని పశ్చిమ భాగంలో చెరువులను నింపారు.

నిన్నటిదాకా కరువుతోపాటు ఫ్యాక్షన్ కుంపట్లతో...
నిన్నటిదాకా కరువుతోపాటు ఫ్యాక్షన్ కుంపట్లతో విలవిల్లాడిన అనంతపురం జిల్లాలో .. పరిస్థితులు మారుతున్నాయి. దేశంలోనే అతి తక్కువర్షపాతం నమోదయ్యే రెండవ జిల్లా అయిన అనంతపురంలో క్రమంగా పచ్చదనం వెల్లివిరుస్తోంది. భూగర్బజలాలు పాతాళంలోకి దిగజారి.. పొలాలన్నీ బీళ్ళుగా మారిన పరిస్థితుల్లో జిల్లావాసులు పొట్టచేతపట్టుకుని వలసలు వెళ్లిన విషాదఛాయలు ఇపుడు కనుమరుగవుతున్నాయి. కరువుతో ఇక పంటలు వేయలేమనుకున్న పరిస్థితుల్లో హాంద్రీనీవా సుజల స్రవంతి తమకు వరప్రదాయినిగా మారిందంటున్నారు రైతన్నలు.

హాంద్రీనీవా నీటితో జిల్లా కరువు పరిస్థితుల్లో మార్పు...
హాంద్రీనీవా నీటితో అనంతపురంజిల్లా కరువు పరిస్థితుల్లో మార్పువచ్చింది. జిల్లాలోని జీడిపల్లి,గొల్లపల్లి రిజర్వాయర్లలలో జలకళ, వీటితోపాటు జిల్లావ్యాప్తంగా పలుచెరువులను కృష్ణాజలాలతో నింపడంతో భూగర్బజలాలు పెరిగాయి. జలసిరులు అందుబాటులోకి రావడంతో గుతకల్లు, ఉరవకొండ, రాప్తాడు నియోజక వర్గాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వర్షాలపై ఆధారపడి పంటలు...
జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో ఫ్యాక్షన్ నేపథ్యం కలిగిన గ్రామాలే ఎక్కువ. ఇక్కడి రైతులు గతంలో పూర్తిగా వర్షాలపై ఆధారపడి పంటలు సాగుచేసేవారు. వర్షాలు లేక పంటలు ఎండిపోవడంతో అప్పులపాలయి దిక్కుతోచని స్థితిలో ఉన్న తమకు కృష్ణాజలాలు ఉపశమనం కలిగించాయంటున్నారు. పచ్చటి పొలాలను చూసి పదిహేనేళ్లు అయిందని ఈ పంటలను చూస్తుంటే ఇక.. ఇక తమప్రాంతంలో ఫ్యాక్షన్‌కు తావేలేదంటున్నారు అన్నదాతలు.

ఇప్పుడు అనంతపురంలో ఉన్న పరిస్థితి గురించి, ఆ రైతులు ఏమంటున్నారో మీరే వినండి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read