‘మనం వున్నా లేకపోయినా సమాజ గమనం ఆగిపోదు, మనం సమాజం కోసం ఏం చేశామన్నదే చరిత్రలో నిలిచిపోతుంది, ఈ విషయాన్ని గుర్తెరిగి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో, దృఢ సంకల్పంతో పనిచేయాల’ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు హితవు పలికారు. 7 మిషన్లకు సంబంధించి ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు, సాధించిన ఫలితాలను విశ్లేషించుకుంటూ, 2017-18 బడ్జెట్ అంచనాలను రూపొందించుకోవాలని ఆయా శాఖాధిపతులకు సూచించారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో 7 మిషన్లపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి- వచ్చేది ఫలిత ఆధారిత బడ్జెట్ కావడంతో అంచనాలు, లక్ష్యాలలో స్పష్టత అవసరమని స్పష్టపరచారు.

ఇక నుంచి అన్ని మిషన్లపై 45 రోజులకోసారి సమీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రతి శాఖను ఇ-ప్రగతితో అనుసంధానించడం ద్వారా జవాబుదారీతనం వస్తుందని చెప్పారు. అభివృద్ధికి ఆర్ధికలోటు అనేది ఆటంకం కాకుండా శాఖలు పరిపుష్టం కావాలన్నారు. ఇందుకు అనుగుణంగా అన్ని శాఖలు సుస్థిర స్వయం సమృద్ధి సాధించే దిశగా ఆదాయవనరులు పెంపొందించుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.

అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలలో బయోమెట్రిక్, సెన్సార్లు, సర్వెలెన్స్ కెమేరాలు అమర్చాలని ముఖ్యమంత్రి అన్నారు. అన్ని పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదటి స్థానాన్ని పదిలం చేసుకోవడంతో పాటు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా తగిన పరిశ్రమలను స్థాపించేందుకు కూడా కృషి జరగాలని అన్నారు. ప్రధానంగా ఎంఎస్ ఎంఈ యూనిట్ల కోసం ఒక అథారిటీని ఏర్పాటు చేయాలని చెప్పారు.

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో తొమ్మిది పట్టణాభివృద్ధికి సంబంధించినవే వున్నాయని, వాటిలో నూరు శాతం ఫలితాలు సాధించేందుకు పురపాలకశాఖ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అన్నారు. అమృత్ పథకం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిధులను పూర్తి స్థాయిలో సంపూర్ణంగా వినియోగించుకుని పట్టణాలు అభివృద్ధి చెందేలా ఈ ఆర్ధిక సంవత్సరంలో స్పష్టమైన కార్యాచరణ వుండాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, రహదారుల అనుసంధానం చేయడంతో పాటు అన్ని గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో గ్రామీణ వాతావరణం ప్రధాన ఆకర్షణగా అగ్రి టూరిజంను ప్రోత్సహించాలని చెప్పారు. వాయు-శబ్ద కాలుష్యాలను గుర్తించేలా సాంకేతికతను వినియోగించుకుని, వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

విద్యావ్యవస్థను సంస్కరించేందుకు, ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అధికారులు మరింతగా దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. విద్యారంగానికి అపార నిధులు, అవకాశాలు కల్పించినా అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడటం వల్ల ఫలితాలు నిరాశాజనకంగా వున్నాయని అసహనం వ్యక్తం చేశారు. అక్షరాస్యతలో, నాక్ రేటింగ్స్‌లో రాష్ట్రం వెనుకబడి వుండటాన్ని అధికారుల నిర్లక్ష్యమే కారణమని తప్పుబట్టారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి పీఎంకేవీవై పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్‌ 4వ స్థానంతోనే సరిపెట్టుకోరాదని మొదటి స్థానంలో నిలవాలని ముఖ్యమంత్రి చెప్పారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందిన యువతలో కనీసం 50 శాతం మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించగలగాలని చెప్పారు.

సమీక్షలో ఇండస్ట్రీ సెక్టార్ మిషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్, నాలెడ్జ్-స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్, అర్బన్ డెవలప్‌మెంట్ మిషన్‌లకు సంబంధించిన వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read