నవ్యాంధ్ర అభివృద్దిలో ప్ర‌భుత్వం ప్ర‌ణాళికాబ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తుంది. ఒకొక్క‌టిగా ప‌రిశ్ర‌మ‌ల‌ను, ఐటీ కంపెనీల‌ను రాష్ట్రానికి ఆహ్వానిస్తుంది. ద‌గ‌ద‌ర్తి విమానాశ్రయాన్ని దేశంలో రెండవ అతిపెద్ద లాజిస్టిక్ కార్గో హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం అవుతున్నాయి. ఈమేర‌కు సీఎం చంద్ర‌బాబునాయుడు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. ఒప్పందం చేసుకున్న తరువాత 18 మాసాలలో విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఆయన మలేసియాకు చెందిన ఏవియేషన్ సంస్థ-‘స్కై పార్క్ బిజినెస్’ ప్రతినిధులకు స్పష్టంచేశారు.

బుధవారం రాత్రి విజయవాడ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి దగదర్తి ఎయిర్ పోర్టు ప్రాజెక్టుపై స్కైపార్క్ ప్రతినిధులతో చర్చించారు. విమానాశ్రయంలో అంతర్భాగంగా కోల్డ్ స్టోరేజ్, వేర్ హౌసింగ్ తదితర నిర్మాణాలను తామే చేపడుతామని స్కైపార్క్ ప్రతినిధులు చెప్పారు. పర్యాటకంగా కూడా ఆకర్షణీయంగా వుండేలా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు.

ఒకప్పుడు ఎంతో చిన్నదిగా వున్న తిరుచనాపల్లి విమానాశ్రయం ఇప్పుడు దేశంలో వున్న గొప్ప విమానాశ్రయాల్లో ఒకటిగా వుందని, ఆ తరహాలో దగదర్తి విమానాశ్రయాన్ని అభివృద్ది చేస్తామని అన్నారు. చెన్నయ్ నగరానికి దగ్గరలో వుండటం, నెల్లూరు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుండటంతో దగదర్తి విమానాశ్రయానికి రానున్న కాలంలో డిమాండ్ వస్తుందనే ఉద్ధేశంతోనే ఇక్కడ ఎయిర్ పోర్టును అభివృద్ధి చేయాలని తలపెట్టామని ముఖ్యమంత్రి చెప్పారు. కృష్ణపట్నం ఓడరేవుకు 30 కిలోమీటర్ల దూరంలో వుండటమే దీనికి ప్రధాన ఆకర్షణ అని అన్నారు. అటు శ్రీసిటీకి దగ్గరగా వుండటం వల్ల అంతర్జాతీయ అవసరాలు తీర్చగలదన్నారు. సమావేశంలో మౌలిక సదుపాయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read