అమరావతిలోని ప్రభుత్వ పరిపాలన నగరంలో పూర్తిగా విద్యుత్ ఆధారిత ప్రజా రవాణా వ్యవస్థ వుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. పులిచింతల దిగువన నిర్మించే రిజర్వాయర్ నుంచి రాజధానికి నేరుగా అనుసంధానమయ్యేలా జల మార్గాన్ని ఏర్పరచి ఎల్లవేళలా ప్రవాహం వుండేలా చూడాలని సూచించారు. నిర్మాణదశ నుంచే అమరావతి గురించి ప్రపంచం మాట్లాడుకునేలా సృజనాత్మకంగా, వినూత్నంగా ఆలోచించి తుది ప్రణాళికలను సిద్ధం చేయాలని బుధవారం మధ్యాహ్నం ఫోస్టర్ అండ్ పార్టనర్స్ బృందంతో జరిగిన సమావేశంలో నిర్ధేశించారు.

అమరావతి నగరం మొత్తం మీద ఎక్కడా కాలుష్యానికి అవకాశం కల్పించరాదని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. భూగర్భ మార్గంలో మెట్రో రైలు, జల మార్గంలో వాటర్ ట్యాక్సీలు, రహదారిపై నడిచే వాహనాలు, అన్నీ కూడా కాలుష్య రహితంగా విద్యుత్ వాహకాలుగానే వుండాలని అన్నారు. ఈనెల ఒకటో తేదీన ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సమర్పించిన భావనాత్మక ప్రణాళిక (కాన్పెప్చువల్ ప్లాన్) పరిశీలించిన ముఖ్యమంత్రి దానికి కొన్ని మార్పులు సూచించారు. మరింత హరిత ప్రదేశం వుండాలని, స్థానికంగా లభ్యమయ్యే ఖనిజ వనరులనే నిర్మాణంలో ఉపయోగించాలని ముఖ్యమంత్రి చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ఫోస్టర్ అండ్ పార్టనర్స్, ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ తదుపరి విస్తృత ప్రణాళికను రూపొందించారు. దానిపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రభుత్వ ముఖ్యులకు ప్రెజెంటేషన్ ఇచ్చారు.

‘అమరావతి-ప్రజారాజధాని-బిల్డింగ్ సస్టెయినబుల్ విజన్’ అనే పేరుతో ఈ స్థూల ప్రణాళికను అందించారు. జల, హరిత సమ్మిళిత అమరావతికి ఇందులో చోటిచ్చారు. 51 శాతం ఆకుపచ్చని ప్రదేశం, 10 శాతం జల భాగం, 14 శాతం రహదారులు, 25 శాతం భవంతుల నిర్మాణాలు (అంటే 10 లక్షల చదరపు మీటర్లు) వుండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సహజ సిద్ధమైన పచ్చిక బయళ్లు, వికసించే పచ్చని వృక్షాలతో ప్రజా ఉద్యాన వనాలు వుండేలా చూశారు.

ప్రజారాజధాని అనే భావనతో ముడిపడి వున్నందున ఇక్కడ ప్రజల కోసం, ప్రజల ద్వారానే సమ్మిళిత వృద్ధి సాధించాలన్న లక్ష్యంతో స్థానికంగా లభ్యమయ్యే నిర్మాణ వస్తు సామాగ్రి, ఉత్పత్తులనే వినియోగించాలని ఫోస్టర్ అండ్ పార్టనర్స్ ఈ విస్తృత ప్రణాళికలో సూచించారు. దానివల్ల స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. అలాగే, ఇక్కడ నెలకొల్పే విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలను ఒకచోటే కేంద్రీకరించకుండా రాజధాని మొత్తానికి విస్తరిస్తారు.

ప్రభుత్వ భవంతుల సముదాయం ప్రజలందరికీ అందుబాటులో వుంటుంది. సాంస్కృతిక నిర్మాణాలు హరిత, జల ప్రదేశాలలో ఏర్పాటుచేస్తారు. సిటీ స్క్వేర్స్, అర్బన్ స్వ్కేర్స్ సమ్మిళితంగా, నిత్య చైతన్యంతో వుంటాయి. కాలువలకు పక్కనుంచి వెళ్లే మార్గం ప్రజోపయోగంగా వుంచుతారు. సుస్థిర విద్యుత్ వినియోగం, సుస్థిర జల వాడకం జరిగేలా చూడటం ఈ ప్రణాళికలో మరో ముఖ్యాంశం. 40 నుంచి 60 శాతం ఆదాతో నగర విద్యుత్ అవసరాలకు తగినట్టుగా పీవి సిస్టమ్ ద్వారా ఎక్కడికక్కడే ఉత్పాదన జరిగేలా ఏర్పాట్లు వుంటాయి. బ్యాటరీ స్టోరేజ్‌కు ప్రాధాన్యం ఇస్తారు. వాతావరణాన్ని చల్లబరచే ఏర్పాట్లు వుంటాయి. వర్షపునీటిని సంరక్షించుకునే విధానాలకు పెద్దఎత్తున ప్రాధాన్యం ఇస్తారు. భూగర్భ జల నిర్వహణ, పునర్ వినియోగ పద్దతులు అమలుచేస్తారు. నగర ప్రజలు వాడుకునే నీటిని సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా సేద్యపు అవసరాలకు మళ్లించే విధానాలు ప్రవేశపెడతారు.

రాజధాని నిర్మాణంలో రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన సంస్కృతి, కళలు, హస్తకళలన్నీ మ్యూజియాలు, సాంస్కృతిక భవంతులు, కళాకేంద్రాలలో పదిలపరుస్తారు. రాజధానిలోని ప్రతి కట్టడంలోనూ మనదైన సంస్కృతి, వారసత్వ చిహ్నాలను నిక్షిప్తం చేస్తారు. పరిపాలన నగరంలో ప్రకృతి సహజంగా వుండే వాతావరణం ప్రస్ఫూటమయ్యేలా చూస్తారు. చల్లని గాలులు, ఆహ్లదభరితంగా వుండే పరిసరాలు, హరిత ఉద్యానాలు అమరావతిలో ఎక్కడికి వెళ్లినా వెంటాడుతాయి. ఉష్ణోగ్రతలను చల్లబరచే పద్ధతులు అమలుచేస్తారు. ఉష్ణోగ్రతలకు తగినట్టుగా స్వభావసిద్ధంగా మారిపోయే గుణం గల సామాగ్రినే భవంతుల నిర్మాణాలలో వినియోగిస్తారు. పెద్దఎత్తున కనిపించే వృక్షాలు చల్లని నీడను అందిస్తాయి. పాలనా నగరం కాలుష్య కారక వాహన రహితంగా వుంటుంది. ప్రజా రవాణాలో కాలుష్య రహిత విధానాలకు పెద్దపీట వేస్తారు. విద్యుత్ వాహనాలకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. సైకిల్ సవారీకి రాజధానిలో ప్రముఖంగా అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. అదే ఫోస్టర్ అండ్ పార్టనర్స్ ప్రణాళికలో సూచించారు. స్మార్ట్ సిటీ కోసం డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విస్తృతంగా వినియోగించాలని ఫోస్టర్ అండ్ పార్టనర్స్ తాజా ప్రణాళికలో వివరించారు. ఐటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ సంయుక్త వినిమయం జరగాలన్నారు.

ఫోస్టర్ అండ్ పార్టనర్స్ అందించిన ఈ ప్రణాళికను ప్రజాబాహుళ్యంలోకి తీసుకువెళ్లి దీనిపై చర్చ జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ప్రభుత్వ కార్యదర్శులు, ఉన్నతాధికారులతో ఒక సమావేశాన్ని నిర్వహించి వారి అభిప్రాయాలు కూడా తీసుకోవాలని చెప్పారు. అమరావతిని ప్రపంచంలోని 5 అగ్రశ్రేణి నగరాలలో ఒకటిగా వుంచాలన్నదే తన ప్రయత్నమని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమావేశంలో ఫోస్టర్ అండ్ పార్టనర్స్ ప్రతినిధులు క్రిస్ బబ్, రాబ్ హ్యారిసన్, రాబ్ సెయ్‌మోర్, హర్ష్ థాపర్, ఏహెచ్‌సీ తరఫున హఫీజ్ కాంట్రాక్టర్, నిషాంత్ గుప్తా, జెడబ్లూ కన్సల్టెంట్ తరఫున అచ్యుత్ వాత్వే పాల్గొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read