సీఎం చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హంద్రీనీవా సుజల స్రవంతి (హెచఎనఎస్‌ఎస్) కాలువ వెడల్పు పనుల టెండర్ల ప్రక్రియ ముగించి, విస్తరణ పనులకు శ్రీకారం చుట్టడంతో రైతన్నల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. మొదటి దశ కాల్వను విస్తరించడం ద్వారా కృష్ణా జలాలను తక్కువ సమయంలో ఎక్కువగా జిల్లాకు తేవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

హంద్రీనీవా కాల్వ ద్వారా వాస్తవానికి 3,850 క్యూసెక్కుల నీరు ప్రవహించేందుకు వీలున్నా.. 2,100-2,200 క్యూసెక్కులకు మించి నీరు ప్రవహించడం లేదు. కర్నూలు జిల్లా మల్యాల నుంచి అనంతపురం జిల్లాలోని జీడిపల్లి జలాశయం వరకు ఉన్న హంద్రీనీవా మొదటి కాల్వ 216.300 కి.మీ.మేర, రూ.1,030 కోట్లతో, 3,850 క్యూసెక్కులు ప్రవహించేలా విస్తరించనున్నారు.

కరవు జిల్లా అనంతకు ఇప్పటి వరకు తుంగభద్ర కాల్వ జీవనాడిగా ఉండగా, ఇకపై హంద్రీనీవా కూడా అత్యంత కీలకమైన సాగు, తాగునీటి వనరుగా మారనుంది. హంద్రీనీవా పరిధిలో సీమ జిల్లాల్లో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇందులో అనంతపురం జిల్లాలోనే అత్యధికంగా 3.45 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది. లక్షల మంది తాగునీటి అవసరాలు తీర్చనుంది.

నిరుడు మహారాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తడంతో హంద్రీనీవా ద్వారా ఆగస్టు నుంచి నీటిని అనంతకు మళ్లించారు. అప్పటి నుంచి ఫిబ్రవరి వరకు కృష్ణమ్మ పరవళ్లు కొనసాగాయి. దాదాపు 28 టీఎంసీల నీరు హంద్రీనీవా ద్వారా తీసుకున్నారు. అయితే ఇంత సుదీర్ఘకాలం కాకుండా శ్రీశైలానికి వరద పోటెత్తినపుడు, ఎగువన మంచివర్షాలతో జలాశయం నిండుకుండలా మారినపుడు, తక్కువ సమయంలో ఎక్కువ నీటిని హంద్రీనీవా ద్వారా జిల్లాకు తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇది మొదటి దశ కాల్వ విస్తరణ ద్వారా సాధ్యమని కూడా తేల్చారు. దీంతో కాల్వ విస్తరణకు ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేశారు.

అనంత కరువుకు సెలవు!
కాలువ వెడల్పు పెరిగితే అనంత జిల్లాకు కరువు తీరుతుందని నిపుణులు చెబుతున్నారు. హెచఎనఎ్‌సఎ్‌స కాలువ వెడల్పు చేస్తే మల్యాలనుంచి రాయలసీమ జిల్లాలకు ఏటా సుమారు 60 టీఎంసీల వరకు నీరు తీసుకునే వీలుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అనంతపురం జిల్లాను కరువు రహితంగా మార్చాలంటే 100 టీఎంసీల నీరు అవసరమని నిపుణులు అంచనా వేశారు. ఇప్పటికే తుంగభద్ర ప్రాజెక్టునుంచి హెచఎల్‌సీ ద్వారా జిల్లాకు సుమారు 22 టీఎంసీల నీరు అందుతోంది. కాలువ వెడల్పు జరిగి లైనింగ్‌ పనులు పూర్తయితే అనంతపురం జిల్లా అవసరాలకు నీటి లభ్యత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అనంతపురం జిల్లాలో కరువు నివారించడానికి హంద్రీనీవా వరప్రదాయనిగా మారనుందని చెబుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read