‘హీరో మోటార్స్‌’స్థాపనకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అవుతుంది. ప్లాంట్ శంకుస్థాపన త్వరలో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నో వివాదాలు మధ్య, భూమి హీరో మోటార్‌ కార్ప్‌ పేరిట రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రపంచంలోనే పేరున్న ద్విచక్ర మోటారు వాహనాల కంపెనీ హీరో మోటోకార్ప్ తమ పరిశ్రమను చిత్తూరుజిల్లా పరిధిలోని, తడ వద్ద గల శ్రీ సిటీ సెజ్ కు సమీపంలో 600ఎకరాల భూమిని హీరో కంపెనీకి రాష్ర్ట ప్రభుత్వం కేటాయించింది. హీరో కంపెనీ తమ ప్లాంటును దక్షిణభారతదేశంలో పెట్టడానికి సిద్ధమవగానే ఆంధ్రాతోపాటు తెలంగాణ, కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు ఆ కంపెనీకి రెడ్ కార్పెట్ పరిచాయి. ఈ ప్రాజెక్టును పట్టుబట్టి సిఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు తెచ్చారు.

ఈ ప్లాంటుకోసం హీరో మోటార్స్‌ మూడు దశల్లో రూ. 1600 కోట్లమేరకు పెట్టుబడి పెట్టనుంది. ప్రత్యక్షంగా 1500 మందికి, పరోక్షంగా మరో 2000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. మొదటి దశ ఉత్పత్తి 201 8నాటికి ప్రారంభమవుతుందని అంచనా వేసినా కోర్ట్ కేసులు కారణంగా, పోయిన ఏడాది పనులు ప్రారంభం కావాల్సి ఉన్నా, ఇప్పటి వరకు కుదరలేదు. ఏటా ఐదు లక్షల వాహనాలు ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం.

‘హీరో మోటార్స్‌’ రాష్ట్రానికి రాకుండా, తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న కొంత మంది...

మొదటి అడ్డంకి: చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మదనపాలెంలో హీరో ప్లాంటు ఏర్పాటు కోసం ఆ సంస్థకు 600 ఎకరాల భూమిని ప్రభుత్వం గతేడాది కేటాయించింది. అయితే, అవి తమ భూములని, తాము వాటిని కొనుగోలు చేశామని, ఈమేరకు పట్టాలు కూడా ఉన్నాయంటూ ఐశ్వర్య ఆర్చిడ్స్‌ అండ్‌ ప్లాంటేషన్‌ అనే సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.

ఈ భూముల పై హైకోర్టు విచారణ జరగగా, వీటిని కేటాయించింది ఒక కర్మాగారానికని, దానివల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుంది కాబట్టి... రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ భూముల్లో ప్లాంటు నిర్మాణం చేసుకోవచ్చునని హైకోర్టు గతేడాది నవంబరు 26న మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ ఏర్పాటులో జాప్యం జరిగితే రాష్ట్రానికి కూడా నష్టమని అభిప్రాయపడింది. ఆ భూములు ప్రైవేటువని తేలితే తగినంత నష్టపరిహారం చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. కానీ, హైకోర్టు మధ్యంతర ఆదేశాలను ఐశ్వర్య సంస్థ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. ధర్మాసనం తీర్పును ప్రకటిస్తూ.. ఐశ్వర్య సంస్థ ప్రయోజనాలను హైకోర్టు తగిన విధంగానే పరిష్కరించిందని, ఆ భూముల్లో ఫ్యాక్టరీ ఏర్పాటు కొనసాగించవచ్చునని, హైకోర్టు తుది తీర్పును బట్టి ఐశ్వర్య సంస్థకు పరిష్కారం లభిస్తుందని చెప్పింది. ఆ భూముల్లో ‘హీరో’ ప్లాంటు ఏర్పాటు చేసుకోవచ్చునని తెలిపింది.

రెండో అడ్డంకి: సుప్రీం కోర్ట్ తీర్పుతో మార్గం సుగుమం అయ్యింది అనుకున్న తరుణంలో, ఈ భూమిలో గ్రామ దేవతగా కొలుస్తున్న కొన్ని చెట్లు ఉన్నాయిని, అవి తీస్తే ఉరుకోము అని, గ్రామస్తులు ఎదురు తిరిగారు. వీరి వెనుక ఎవరు ఉన్నా, సెంటిమెంట్ తో కూడుకున్నది కాబట్టి, గ్రామస్థులతో అధికారులు చర్చలు జరిపారు. వారి సెంటిమెంట్‌ను గౌరవించి, గ్రామదేవత కోసం ఆలయాన్ని నిర్మించి ఇచ్చారు. ఇలా, భూవివాదాన్ని పరిష్కరించుకొన్నారు.

ఇలా అన్ని అడ్డంకులు తొలగించుకున్న నేపథ్యంలో త్వరలోనే హీరో మోటార్‌ కార్ప్, ఈ భూములను రిజిసే్ట్రషన్‌ చేసుకునేందుకు రానున్నది. మరి ఇంకా ఏ అడ్డంకులు రాకుండా, ప్రపంచంలోనే పేరున్న ద్విచక్ర మోటారు వాహనాల కంపెనీ మన రాష్ట్రంలో మొదలవ్వాలని కోరుకుందాం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read