కార్గో హ్యాండ్లింగ్‌లో విశాఖపట్నం పోర్టు ట్రస్టు రికార్డు సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరం 2016-17లో 61.02 మిలియన్ టన్నుల సరకు రవాణా చేయగలిగింది. అంతకుముందు 2015-16 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే సరకు రవాణాలో 7 శాతం గ్రోత్ సాధించింది. ఇతర పోర్టుల నుంచి తీవ్ర పోటీ ఉన్నప్పటికీ గత ఏడాదితో పోల్చితే 4 మిలియన్ టన్నుల సరకు రవాణా పెరిగింది.

2016-17 సంవత్సరానికి గాను 11.42 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం రవాణా చేయగా, గత ఏడాదితో పోల్చితే 91 శాతం అధికం. 2015-16లో ఇనుప ఖనిజం రవాణా కేవలం 5.98 శాతం మాత్రమే. అలాగే, కంటైనర్ కార్గోలోనూ విశాఖ పోర్టు రికార్డులు తిరగరాసింది. 2016-17లో 6.43 మిలియన్ టన్నుల కంటైనర్ కార్గో సాధించగా, గత ఏడాది 5.15 మిలియన్ టన్నులుతో, ఈ రంగంలో 25 శాతం వృద్ధి సాధించింది.

బాక్సైట్ ఖనిజ రవాణా 1.01 మిలియన్ టన్నులవగా, అంతకుముందు సంవత్సరం కేవలం 0.48 మిలియన్ టన్నులు మాత్రమే. పెట్రోలియం కోక్ రవాణా 2.10 మిలియన్ టన్నులు కాగా, నిరుడు 1.67 టన్నులు మాత్రమే. జిప్సమ్ ఖనిజ రవాణాలో కూడా పోర్టు మంచి ఫలితాలు సాధించింది. 10.17 లక్షల టన్నుల జిప్సమ్ రవాణా చేయగా, అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 34 శాతం అధికం. ఇది ఇలా ఉంటే, సుమారు దశాబ్దకాలం అనంతరం విశాఖ పోర్టు రష్యా, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా దేశాల నుంచి 4.17 లక్షల టన్నుల గోధుమలను దిగుమతి చేసుకుంది.

2016-17 ఆర్థిక సంవత్సరంలో విశాఖ పోర్టుకు సరకు రవాణా నిమిత్తం 1,944 నౌకలు రాకపోకలు సాగించాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read